న్యూఢిల్లీ:సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి హోలీ సందర్భంగా ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేయాలని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్‌డీఎంసీ) నిర్ణయించింది. విద్యుత్ ఆదా కోసం మామూలు బల్బులు బదులు ఎల్‌ఈడీ బల్బులు వాడేలా ప్రజల్లో అవగాహన పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈసారి హోలీకి తమ సిబ్బందికి స్వీట్లు బదులు ఎల్‌ఈడీ బల్బులను అందజేయనున్నట్లు ఎన్‌డీఎంసీ చైర్మన్ జలజ్ శ్రీవాత్సవతెలిపారు. ప్రతియేటా సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి హోలీ సందర్భంగా స్వీట్లు ఇవ్వడం సంప్రదాయమని, గత ఏడాది రూ.94 లక్షల విలువైన స్వీట్లను అందజేశామన్నారు.అయితే ఈ ఏడాది కేవలం పారిశుద్ధ్య సిబ్బందికే కాకుండా సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మూడేసి ఎల్‌ఈడీ బల్బులను అందజేయాలని నిర్ణయించామన్నారు. సాధారణ కుటుంబం ఏడాదికి 5 బల్బులను వాడుతుందని, కాగా సిబ్బందికి తాము ఇచ్చిన మూడు బల్బులతోపాటు మరో రెండు బల్బులు వారు కొనుగోలుచేసుకునేవిధంగా ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు.
కాగా, దీనికి ఎంత ఖర్చు పెట్టాలనేది ఇంకా నిర్ణయించలేదన్నారు. ఇదిలా ఉండగా, డొమెస్టిక్ ఎఫీషియంట్ లైటింగ్ ప్రోగ్రాం (డీఈఎల్‌పీ) కింద ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. మార్కెట్లో రూ.350- 600 పలికే ఎల్‌ఈడీ బల్బును ఈ పథకం కింద లబ్ధిదారుడికి రూ.130కే అందజేస్తారు. దీనినిమిత్తం మొదట కేవలం రూ.10 తీసుకుంటారు. అనంతరం ఏడాదిపాటు కరెంటు బిల్లులో నెలకు రూ.10 చొప్పున అదనంగా వసూలుచేస్తారు. త్వరలోనే ఢిల్లీనగరంలోని గృహాలు,ఆస్పత్రులు, స్కూళ్లలో ఎల్‌ఈడీ బల్బుల వినియోగంపై అవగాహనపెంచి విద్యుత్ ఆదాకు కృషిచేస్తామని జలజ్ శ్రీవాత్సవ తెలిపారు.
హోలీకి ఎల్‌ఈడీ బల్బుల నజరానా
Published Wed, Jan 7 2015 11:02 PM | Last Updated on Wed, Oct 17 2018 3:46 PM
Advertisement