తమిళనాడుకు తాగునీటి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు గంగ నీటిని 3 టీఎంసీలు విడుదల చేస్తుందని ఎస్‌ఈ సన్యాసి నాయుడు తెలిపారు.
సత్యవేడు :తమిళనాడుకు తాగునీటి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు గంగ నీటిని 3 టీఎంసీలు విడుదల చేస్తుందని ఎస్‌ఈ సన్యాసి నాయుడు తెలిపారు. కండలేరు నుంచి కాలువలో ప్రవహిస్తున్న గంగ నీరు మంగళవారం సాయంత్రం 6 గంటలకు సత్యవేడు సమీపంలోని ఆబాకం వద్దగల జీరో పాయింట్ చేరింది. 151.837 కిలోమీటరు వద్ద రాష్ట్ర సరిహద్దులో జీరో పాయింట్‌ను గంగనీరు దాటే సమయంలో తమిళనాడు రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడల శాఖ మంత్రి బెంజిమన్, పూందమల్లి, గుమ్మిడిపూడి, పొన్నేరి ఎమ్మెల్యేలు ఏలుమలై, విజయకుమార్, బలరామన్ గంగనీటికి పూలుచల్లి పూజలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి బెంజిమన్ మాట్లాడుతూ గంగ కాలువ ద్వారా నీరు రెడ్‌హిల్స్ చెరువుకు పంపుతారని, అక్కడ నీటిని శుభ్రం చేసి చెన్నై పట్టణానికి పైపుల ద్వారా అందిస్తామని తెలిపారు. తమిళనాడులో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలుగుగంగ ఈఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాగునీటి కోసం తమిళనాడుకు తెలుగుగంగను సరఫరా చేస్తోందని, ప్రస్తుత ఒప్పందంలో ఆంధ్రప్రదేశ్‌లో చెరువులకు నీటి సరఫరా లేదని చెప్పారు.
నీటి కోసం నిరీక్షణ
గంగ నీరు జీరో పాయింట్‌కు మంగళవారం ఉదయం పది గంటలకే చేరుతుందని అక్కడికి ఆంధ్ర, తమిళనాడు నీటి పారుదలశాఖ అధికారులు చేరుకున్నారు. కాలువలో పూడిక అధికంగా ఉండడంతో నీటి ప్రవాహం వేగం తగ్గింది. దీంతో సాయంత్రం జీరో పాయింట్‌కు చేరే వరకు అధికారులు నిరీక్షించారు. వారితోపాటు గుమ్మిడిపూడి, తిరువళ్లూరు, ఊత్తుకోటకు చెందిన ఏడీఎంకే నాయకులు వేచి ఉన్నారు. తమిళనాడు అధికారుల డీఆర్‌డీఏ పీడీ మహేంద్రన్, ఎస్‌ఈ భక్తవత్సలం, ఈఈఈ శ్రీనివాసన్, తెలుగుగంగ అధికారులు ఈఈ వెంకటరమణారెడ్డి, డీఈ సురేష్‌బాబు, ఏఈలు ప్రశాంత్, రవి, సంజయ్, సిబ్బంది పాల్గొన్నారు.