అనంతపురం టవర్ క్లాక్ : ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రాష్ట్ర రైతు సంఘం నేతలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక వీకే భవన్‌లో రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు రోజుల రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను రైతు సంఘం జాతీయ నాయకుడు కొల్లి నాగేశ్వర్‌రావ్ పార్టీ జెండాను విష్కరించి ప్రారంభించారు. అన్ని జిల్లాల రైతు సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, జాతీయ నాయకులు, శాస్త్ర వేత్తలు హాజరయ్యారు.
వ్యవసాయ శాస్త్రవేత్త, జయంతీ ఘోష్ కమిషన్ సభ్యుడు కేఆర్ చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో లాభసాటి వ్యవసాయంపేరుతో దండగ చేస్తున్నారన్నారు. చిన్న సన్నకారు రైతులు పట్టణాలకు వలసలు పోతున్నారన్నారు. లాభాలే పరమావధిగా విత్తన కంపెనీలు వ్యవహరిస్తుండడంతో రైతులు నష్టాలు పాలవుతున్నారన్నారు. విత్తన ధరల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సరళికృత విధానాలను వీడాలన్నారు. ఖర్చులు పెరగడం, మద్దతు ధర లభించకపోవడంతో రైతులు వ్యవసాయాన్ని మానేస్తున్నారన్నారు.
బ్యాంకులు కేవలం 30 శాతం మంది రైతులకు మాత్రమే రుణాలు అందచేస్తుండగా, మిగిలినవారు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ రంగంగా మార్చేందుకు యత్నిస్తోందని ధ్వజమెత్తారు. సుస్థిర వ్యవసాయాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలన్నారు. రైతు సంఘం అధ్యక్షుడు రామచంద్రయ్య మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు కృష్ణా జలాలే శరణ్యమన్నారు.
రైతులు, ప్రజాసంఘాలు నీటి కోసం ఉద్యమించాలన్నారు. చంద్రబాబును నిలదీసి హంద్రీనీవా ద్వారా అన్ని చెరువులకు నీరందించేందుకు వంద టీఎంసీల వాటాను రాబట్టుకోవాలన్నారు. ‘ప్రకృతి విపత్తులు- ఎదురయ్యే సమస్యలు’ ‘వ్యవసాయ ఉత్పత్తులు, మార్కెట్లు, గిట్టుబాటుధరలు’, రైతాంగానికి అనుకూల పరిస్థితి, విధివిధానాలు, బ్యాంకుల, రుణమాఫీ తదితర అంశాలపై రైతులకు వివరించారు. దేశీయ పాడిపరిశ్రమ, ఎరువులు తయారు చేసుకొనే పద్ధతులు, పురుగుమందులేని వ్యవసాయ విధానాలను వివరించారు.
రైతు సంఘం రాస్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల వెంక య్య, సీనియర్ రైతు సంఘం నేతలు ఎంవి రమణ, సూర్యనారాయణరెడ్డి, రాష్ర్ట్ర కార్యదర్శి జగన్నాథం, రాష్ట్ర కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రసాద ఆల్‌ఇండియా కిసాన్ జాతీయ నాయకురాలు శీతారామమ్మ, గంగాభవాపీ, సీపీఐ అనంతపురం జిల్లా కార్యదర్శి జగదీష్, రైతు సంఘం కార్యదర్శి కాటమయ్య, శిల్పకాలేశ్వర్, సువర్ణ, వివిధ జిల్లాల రైతు సంఘం జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు మాదన్న(కర్నూలు), లెంకాలలక్ష్మి(విజయనగరం),సుబ్బారావు(పశ్చిమగోదావరి), యానాదరావు(కృష్ణా), ప్రసాద్ (ప్రకాశం ), వెంకటేశ్వర్లు( నెల్లూరు), ఉమాపతినాయుడు(చిత్తూరు), సుబ్బారెడ్డి(వైఎస్సార్‌జిల్లా), రైతులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విధానాలతో రైతు ఆత్మహత్యలు
Published Fri, Sep 12 2014 2:38 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM
Advertisement
Advertisement