
శ్రీవారిని ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదు
గవర్నర్ నరసింహన్
సాక్షి, తిరుమల/తిరుచానూరు: ఏడుకొండలవాడిని ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఆదివారం ఉదయం ఆయన సతీసమేతంగా తిరుచానూరు పద్మావతీ అమ్మవారిని, సాయంత్రం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొన్నారు.
మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణలకు శ్రీవేంకటేశ్వరుని ఆశీస్సులుంటాయన్నారు. తెలుగు ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. 2 రాష్ట్రాల మధ్య ఆస్తుల వివాదాలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి? అని ప్రశ్నించగా ‘‘మా వద్ద ఎలాంటి ఆస్తుల్లేవ్. ఆస్తులన్నీ వేంకటేశ్వరుని వద్దే ఉన్నాయి. ఆయన్నే అడగండి’’ అంటూ చమత్కరించారు.