► కిరణ్‌బేడీ, నారాయణస్వామి కోల్డ్‌వార్
► ప్రభుత్వ అధికారుల తంటాలు
టీనగర్: పుదుచ్చేరిలో గవర్నర్ కిరణ్‌బేడి, ముఖ్యమంత్రి నారాయణస్వామి మధ్య కోల్డ్‌వార్‌తో ప్రభుత్వ అధికారులు తంటాలు పడుతున్నారు. పుదుచ్చేరి గవర్నర్ కిరణ్‌బేడి ప్రభుత్వ అధికారులను వెంటనే సంప్రదించేందుకు వాట్సప్ గ్రూప్‌లను ప్రారంభించి నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు, ప్రభుత్వ శాఖలతో నేరుగా చర్చలు జరిపేందుకు ఈ వాట్సాప్ గ్రూపులను వినియోగిస్తున్నారు. ఇందులో ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్, పీసీఎస్ అధికారులు చోటుచేసుకున్నారు. గత 29వ తేదీన గవర్నర్ వాట్సాప్ గ్రూపులో సహకార సంఘాల రిజిస్ట్రార్ శివకుమార్ అసభ్య వీడియోను పంపడం చర్చకు దారితీసింది. అతన్ని వెంటనే గవర్నర్ బంగళాకు రప్పించిన కిరణ్‌బేడి సస్పెండ్ ఉత్తర్వులను అందజేశారు.
అంతేకాకుండా సీబీసీఐడీ పోలీసులచే కేసు నమోదైంది. కాగా, గవర్నర్ చర్యలను నేతలు, అధికారులు ఖండించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ఉత్తర్వులను వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్లలో ఉపయోగించేందుకు నిషేధం విధించారు. ఇది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులుగా అన్ని శాఖలకు సర్కులర్‌గా పంపారు. ఈ చర్య కారణంగా గవర్నర్ వాట్సాప్ గ్రూప్ నుంచి అధికారులు వైదొలిగారు. ఇలావుండగా పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి సోషల్ మీడియా నెట్‌వర్క్ వినియోగంపై నిషేధ ఉత్తర్వులను గురువారం గవర్నర్ కిరణ్‌బేడి రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వపు నిర్ణయాన్ని గవర్నర్ రద్దు చేయడంతో గవర్నర్, పాలకుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీసింది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు గవర్నరా? ముఖ్యమంత్రా? ఎవరి అదుపాజ్ఞలకు లోబడాలని తెలియకుండా అవస్థలు పడుతున్నారు. దీంతో ప్రజా సంక్షేమ పనులకు ఆటంకం ఏర్పడే పరిస్థితి నెలకొంది. దీనిపై సీఎం నారాయణస్వామి స్పందిస్తూ గవర్నర్‌తో నిర్వహణ రీతిగా కొన్ని లోపాలు ఉండొచ్చని, అయితే ఆమెతో ఎటువంటి ఘర్షణ లేదని అన్నారు.
కుషు్బకు పాస్‌పోర్ట్ చిక్కులు:
నటి కుషు్బకు పాస్‌పోర్టు చిక్కులు ఎదురయ్యాయి. ఆమె మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో ఈ విధంగా తెలిపారు. తన పాస్‌పోర్టు బుక్‌లో పేజీలు ఉపయోగించి పూర్తయిందని, అదనపు పేజీలను జతచేయాలని కోరుతూ పాస్‌పోర్టు కార్యాలయంలో అభ్యర్థించానని, అదే విధంగా పాస్‌పోర్టు రెన్యువల్ చేయాలని కోరినట్లు తెలిపారు. తన కోర్కెను పాస్‌పోర్టు అధికారి నిరాకరించారని, తనపై క్రిమినల్ కేసు ఉన్నందున రెన్యువల్ వీలుకాదని గత నెల 28న పాస్‌పోర్టు అధికారి ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ఇది చట్టవిరుద్ధమని దీన్ని రద్దు చేయాలని తెలిపారు. తాను ఈనెల 12న విదేశాలకు వెళ్లనున్నందున పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేసేందుకు ఉత్తర్వులివ్వాలని కోరారు. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిపిన న్యాయమూర్తి రాజేంద్రన్ వారంలోగా పాస్ట్‌పోర్టు సదరన్ రీజియన్ అధికారి కోర్టులో సంజాయిషీ పిటిషన్ దాఖలు చేయాలని కోరుతూ ఉత్తర్వులిచ్చారు.