
అభివృద్ధి పేరుతో అరాచకాలా?
భీమవరం: అభివృద్ధి పేరుతో చంద్రబాబు సర్కారు అరాచకాలకు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ నేతలు కొలుసు పార్థసారధి, మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు వైఎస్సార్ సీపీ నాయకుల బృందం ఆక్వాఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో బుధవారం పర్యటించింది. ఈ సందర్భంగా పార్థసారధి, వెంకటరమణ విలేకరులతో మాట్లాడుతూ... ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణంపై స్థానికులకు ఉన్న అనుమానాలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఆయా గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేయాలని, గ్రామస్తుల బనాయించిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. తుందుర్రు, బేతపూడి, జొన్నలగరువులో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ప్రజలు బయటకు వస్తే కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని ప్రజలు తమ వద్ద వాపోయారని చెప్పారు. ఆక్వాఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో వాస్తవ పరిస్థితులను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళతామని వెల్లడించారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అభివృద్ధి పేరుతో అరాచకాలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు.