
19న తుందుర్రుకు వైఎస్ జగన్
మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ బాధితులతో ముఖాముఖి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 19న పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రు గ్రామానికి వస్తున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని శనివారం తెలిపారు. భీమవరం, మొగల్తూరు మండలాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారని పేర్కొన్నారు. గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా తుందుర్రు, పరిసర గ్రామాల ప్రజలు రెండేళ్లుగా ఉద్యమిస్తున్న విషయం విదితమే. అయితే, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చేపట్టింది.
35 రోజుల క్రితం తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల్లో 144 సెక్షన్ విధించి, 37 మందిపై హత్యయత్నం కేసులు నమోదు చేశారు. ఏడుగుర్ని జైళ్లకు పంపించారు. మరో 120 మందిపై బైండోవర్ కేసులు పెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బృందం జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలిసి ఆక్వాపార్క్ బాధితులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని, 144 సెక్షన్ తొలగించి గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని కోరింది. మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, కొలుసు పార్థసారథి తదితరుల నేతృత్వంలో బృందం ఇప్పటికే బాధిత ప్రాంతాల్లో పర్యటించి ఇక్కడి విషయాలను వైఎస్ జగన్‌కు నివేదించింది. ఈ నేపథ్యంలో బాధితులను ప్రత్యక్షంగా కలిసి వారిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వస్తున్నట్లు ఆళ ్లనాని వివరించారు.