ఇక్కడి వరకు రానివ్వొద్దు..
ఇక్కడి వరకు రానివ్వొద్దు..
Published Tue, Oct 18 2016 11:39 AM | Last Updated on Thu, Mar 21 2019 7:25 PM
క్షేత్రస్థాయిలోనే సమస్యలు పరిష్కరించాలి
అప్పుడు గ్రీవెన్స్ కు దరఖాస్తులు రావు..
అధికారులు గ్రామాల్లో పర్యటిస్తేనే ఫలితం
జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
వరంగల్ రూరల్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన వరంగల్ రూరల్ జిల్లాలో పరిధిలోని మండలాల ప్రజల సమస్యలను అధికారులు ఎక్కడికక్కడ పరిష్కరించాలని కలెక్టర్ జీవన్ ప్రశాంత్ పాటిల్ సూచించారు. తద్వారా గ్రీవెన్స్ సెల్‌కు వచ్చే వారు తగ్గిపోతారని.. ఇందుకోసం అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని ఆదేశించారు. కొత్తగా జిల్లా ఏర్పడిన అనంతరం సోమవారం కలెక్టరేట్‌లో తొలి గ్రీవెన్స్ సెల్ జరిగింది. ఈ సందర్భంగా హాజరైన అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ పరిపాలనలో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
పరిధి తక్కువే..
‘తొలి గ్రీవెన్స్ సెల్‌కు పెద్దసంఖ్యలో దరఖాస్తులు దారులు వచ్చారు... వీరి సంఖ్య ఎప్పటికప్పుడు తగ్గుతుండాలి... అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరిస్తే ఇది సాధ్యమవుతుంది’ అని కలెక్టర్ జీవన్ ప్రశాంత్ పాటిల్ అన్నారు. అలాగే, కలెక్టరేట్‌లో జరిగే గ్రీవెన్స్ సెల్‌కు వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై శ్రద్ధ చూపాలని సూచించారు. జిల్లాలో తక్కువ మండలాలే ఉన్నందున.. అధికారులు వారంలో మూడు రోజులు గ్రామాల్లో పర్యటించి, ప్రజలకు అందుబాటులో ఉండాలని.. తద్వారా వారి సమస్యలు తెలియడంతో
పాటు పరిష్కారానికి మార్గం సులువవుతుందని తెలిపారు.
ఆన్లైన్ లో ఫిర్యాదులు
వచ్చే సోమవారం నుంచి ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను ఆన్లైన్ లో నమోదు చేస్తామని కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ చెప్పారు. ఆ తర్వాత విభాగాల వారీగా ఫిర్యాదులను ఆయా శాఖల అధికారుల లాగిన్ లో వేస్తామని తెలిపారు. ఇందులో ప్రతీ సమస్యను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని, లేనిపక్షంలో కారణాలను ఫిర్యాదుదారులకు మెసేజ్ రూపంలో పంపించాలని సూచించారు. అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు, వాట్సప్‌లో కూడా జిల్లా పరిపాలనా యంత్రాంగానికి అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
గ్రీవెన్స్ సెల్‌లో జాయింట్ కలెక్టర్ ఎం.హరిత, డీఆర్‌ఓ వెలమపల్లి నాగరాజారావు, రూరల్ ఆర్డీఓ సురేందర్‌రావు, ఏఓ పి.సత్యనారాయణరావు, జిల్లా వెనకబడిన తరగతుల, దళిత అభివృద్ధి, మైనార్టీ అభివృద్ధి శాఖ అధికారులు ఎం.నరసింహస్వామి, పి.రవీందర్‌రెడ్డి, ఎం.డీ.సర్వర్‌మియా, జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.నిరుపమ, డీఎస్‌ఓ విలియం పీటర్, డీపీఆర్‌ఓ కిరణ్మయి, జిల్లా గిరిజన అభివృద్ది అధికారి టి.నిర్మల, డీఈఓ నారాయణరెడ్డి, డీఎఫ్‌ఓ కె.పురుషోత్తం, డీఎంహెచ్‌ఓ డాక్టర్ అశోక్ ఆనంద్ పాల్గొన్నారు.
రక్షణ కోసం మొదటి దరఖాస్తు
భూమి విషయంలో మాజీ మిలిటెంట్ పెండ్లి రఘుతో తనకు ప్రాణభయం ఉందని నల్లబెల్లి మండలం రాంతీర్థం గ్రామానికి చెందిన మనికంటి రాజిరెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పెండ్లి రఘుతో పాటు ఎరుకల సునీత, ఎరుకల మల్లారెడ్డితో ప్రాణభయం ఉన్నందున రక్షణ కల్పించాలని కోరారు. దీనికి స్పందించిన కలెక్టర్ తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
Advertisement