గ్రీవెన్స్‌కు కొత్త కళ
నేటి నుంచి నిర్మల్‌లో జిల్లా ప్రజా ఫిర్యాదుల విభాగం
అర్జీలు స్వీకరించనున్న కలెక్టర్, జేసీ, ఉన్నతాధికారులు
తగ్గిన దూరభారం.. జిల్లా ప్రజల్లో స్థానికత సంబరం..
సాక్షి, నిర్మల్ : నిర్మల్‌లోనే ప్రజా ఫిర్యాదుల విభాగం.. ఎప్పటి లాగే ఇప్పుడు ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి అర్జీ ఇవ్వడమే.. అయితే ఇప్పుడు పెద్ద మార్పు.. ఇప్పుడది ఆర్డీవో కార్యాలయం కాదు.. మన కొత్త జిల్లా కలెక్టర్ కార్యాలయం.. ఈసారి గ్రీవెన్స్‌లో డివిజినల్ అధికారులు కాదు.. జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకుంటే అన్ని శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉంటారు.. విజయదశమికి కొత్త జిల్లా ఆవిర్భవించిన అనంతరం మొదట సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగం కొత్త కళ సంతరించుకుంది. ఇప్పుడు నిర్మల్ జిల్లా ప్రజలకు ఈ సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది.
తొలి గ్రీవెన్స్‌కు ఏర్పాట్లు పూర్తి
ప్రజా ఫిర్యాదుల విభాగం కోసం నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రధాన ముఖ ద్వారం నుంచి ఎదురుగా ఉన్న హాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభిస్తారు. కలెక్టర్ ఇలంబరిది, జేసీ సీహెచ్.శివలింగయ్య తదితరులు పాల్గొనున్నారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు సోమవా రం రోజు ప్రజా ఫిర్యాదుల విభాగానికి హాజరు కావాలని జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు వెళ్లా యి. దీంతో కలెక్టరేట్ కార్యాలయంలో సోమవా రం కొత్త సందడి కనిపించనుంది. జిల్లా ఆవిర్భావానికి ముందు ఉమ్మడి ఆదిలాబాద్‌లో నిర్మల్ ప్రజలు ఆర్డీవో కార్యాలయంలో అర్జీలు అందజేసేవారు. ల్జేజీజ్డౌ ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వె ళ్లి అర్జీ ఇచ్చేవారు. అప్పుడు కలెక్టరేట్‌కు వెళ్లాలం టే నిర్మల్ నుంచి 80 కిలోమీటర్లు, అదే ముథోల్ నియోజకవర్గ ప్రజలకైతే 130 కిలోమీటర్లకు పైగా వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు నిర్మల్‌లోనే కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులకు అర్జీలు అందజేసే వీలుండడంతో ప్రజల్లో ఉత్సాహం వ్యక్తమవుతుంది. దూరభారం తగ్గడంతో పాటు ఒకవేళ పని పూర్తయినా కాకపోయినా మళ్లీ వచ్చేందుకు సులువుగా ఉంటుందని ఖర్చు కూడా తగ్గుతుందని ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.
సమస్యల పరిష్కారంపై కోటి ఆశలు
ప్రజా ఫిర్యాదుల విభాగంలో అందజేసే అర్జీల పరిష్కారంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఒక అర్జీ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి పరిష్కారం అయింది, కానిది సమాచారం అర్జీదారుడికి తెలియజేయాల్సి ఉంటుంది. ప్రజలు అర్జీ అందజేసిన తర్వాత వారికి అర్జీ అందజేసినట్లు ఒక పత్రం అందజేస్తారు. మొదట అర్జీ తీసుకునే సమయంలోనే అతని పేరు, ఫోన్ నంబర్, చిరునామా, అర్జీకి సంబంధించిన వివరాలు, ఏ అధికారి శాఖ పరిధిలోకి వస్తుంది అనేది ఆ పత్రంలో నమోదు చేస్తారు. అర్జీ అందజేసిన నెల రోజుల్లో బాధితుడి సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయిలో స్వీకరించిన ఈ అర్జీని క్షేత్ర స్థాయిలో పరిశీలనకు డివిజనల్ నుంచి మండల, గ్రామ స్థాయి వరకు పంపించాల్సి ఉంటుంది. దీనికి ఆయా స్థాయిల్లో నిర్ధారిత గడువు ప్రకారం పూర్తి చేసి నెల రోజుల్లో బాధితుడికి న్యాయం చేయాలి ఇది గ్రీవెన్స్ ముఖ్య ఉద్దేశం. సాధారణంగా గ్రీవెన్స్‌కు ఎక్కువగా భూ సంబంధిత సమస్యలే అధికంగా వస్తుంటాయి. పింఛన్లు ఇవ్వాలని అధికారులను కోరేందుకు ఇక్కడికి వస్తారు. గతంలో రేషన్‌కార్డుల కోసం కూడా అధికంగా అర్జీలు వచ్చేవి. ఇవే కాకుండా చౌక ధరల దుకాణాల్లో అవకతవకలు, వివిధ పథకాల్లో అన్యాయాలు, తదితర సమస్యలపై కూడా పలువురు గ్రీవెన్స్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్తుంటారు. ఈ నేపథ్యంలో గ్రీవెన్స్‌పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు.
grievance cell , nirmal, collector offdice,