నిర్మల్‌టౌన్: అక్రమాలకు తావు లేకుండా నిత్యావసర సరుకులను పారదర్శకంగా లబ్ధిదారులకు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంఎస్ ఫంక్షన్ హాలులో శుక్రవారం చౌకధరల దుకాణాల డీలర్లకు ఈ పాస్ యంత్రాల వినియోగంపై నిర్వహించిన శిక్షణ, అవగాహన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఖానాపూర్, కడెం, దస్తూరాబాద్, పెంబి, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు నిర్మల్‌రూరల్, నిర్మల్‌అర్బన్, సోన్, లక్ష్మణచాంద, మామడ మండలాలకు సంబంధించిన రేషన్ డీలర్లకు ఈ పాస్‌పై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ, చౌకధరల దుకాణాల్లో బయోమెట్రిక్ విధానం ద్వారా సరుకులను పంపిణీ చేసేందుకు ఈ–పాస్ యంత్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు సౌలభ్యంగా, పారదర్శకంగా నిత్యావసర సరకులను పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఈ పాస్ యంత్రాలను ఏర్పాటు చేశామన్నారు. దీనివల్ల రేషన్ సరుకులు పక్కదోవ పట్టకుండా ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. రేషన్ అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈపాస్‌ను ప్రవేశపెట్టిందన్నారు. రేషన్ డీలర్లకు అర్థమయ్యేలా ఈ పాస్ యంత్రాల పనితీరుపై ఆమె వివరించారు. అనంతరం ఈపాస్ బయోమెట్రిక్ మిషన్‌లను రేషన్ డీలర్లకు పంపిణీ చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ, రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఈపాస్ యంత్రాలతో 48 లక్షల లావాదేవీలు నిర్వహించినట్లు తెలిపారు.
వచ్చే నెల 18 నుంచి...
ఈ నెలలో కొత్తగూడెం, గద్వాల్, ఖమ్మం, నాగర్‌కర్నూల్, వనపర్తి, యాదాద్రి బోనగిరి జిల్లాల్లో ఈపాస్ యంత్రాలపై శిక్షణ కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. శనివారం నుంచి నల్గొండ, సూర్యాపేట్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పాస్ మిషన్‌ల ద్వారా ఆన్‌లైన్ బయోమెట్రిక్ విధానంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆర్డీవో ప్రసూనాంబా, జిల్లా పౌరసరఫరాల ఇన్‌చార్జి అధికారి వాజీద్, సివిల్ సప్‌లై జిల్లా మేనేజర్ శ్రీకళ, ప్రాజెక్టు మేనేజర్ రఘునందన్, అసోసియేట్ మేనేజర్ శ్రావణ్, జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు రాజేందర్, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment