- వేలి ముద్రలు పడలేదని 19.92 లక్షల మందికి అందని సరుకులు
- పేదల కడుపు కొడుతున్న సాంకేతికత
- బ్యాంకు ఖాతాలో డబ్బులుంటేనే రేషన్..
- సర్కారు నిర్ణయాలతో వృద్ధుల్లో తీవ్ర ఆందోళన
సాక్షి, అమరావతి
వేలి ముద్రలు సరిగా లేక ఈ–పాస్ మెషిన్ వాటిని స్వీకరించక పోవడం, కొత్త రేషన్‌కార్డుల్లో తప్పుల తడకలు తదితర కారణాల వల్ల ఈ నెలలో 19.92 లక్షల మంది పేదలు రేషన్ సరుకులు పొందలేకపోయారు. బియ్యం, చక్కెర, గోధుమలు, గోధుమ పిండి, కిరోసిన్ తదితర రేషన్ సరుకులపై ఆధారపడి బతుకీడుస్తున్న లక్షలాది మంది వయోవృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, ఏ పనీ చేసుకోలేని వారి పరిస్థితి సాంకేతికత పుణ్యమా అని దయనీయంగా మారింది.
రాష్ట్రంలో 1.38 కోట్ల తెల్లరేషన్ కార్డులు ఉంటే ఇలాంటి సమస్యలతో ప్రతి నెలా లక్షలాది మంది పేదలు రేషన్‌కు దూరం అవుతున్నారు. వేలి ముద్రలు సరిగా పడని వారికి గ్రామ రెవెన్యూ కార్యదర్శి (వీఆర్వో) సర్టిఫికెట్ ఇస్తే రేషన్ ఇస్తామని ప్రభుత్వం చెబుతున్న మాట లు క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. రేషన్‌షాపు వరకు నడవలేని వృద్ధులకు వారి ఇంటికే వెళ్లి రేషన్ ఇవ్వాలన్న ఆదేశాలు కూడా సరిగా అమలు కావడం లేదు. దీనికి తోడు నగదు రహితంగానే రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా తీసుకోవడం కూడా పలు ఇబ్బందులకు కారణమ వుతోంది. కృష్ణా జిల్లాలో 85 శాతం పైగా నగదు రహితం గానే సరుకులు ఇవ్వాలని కలెక్టర్ అహ్మద్ బాబు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో ఇటు లబ్ధిదా రులు, అటు రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విజయవాడలో ఒక వ్యక్తి రేషన్ కోసం వెళ్తే నగదు రహిత విధానంలో సరుకులు ఇస్తామని చెప్పారు. చేసేదిలేక ఆ వ్యక్తి బ్యాంకుకు ఆటోలో వెళ్లి ఖాతాలో సరుకులకు అయ్యే మొత్తం జమ చేసి వచ్చారు. ఇందుకు తనకు రూ.30 ఖర్చు అయ్యిందని ఆ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ప్రతి నెలా బ్యాంకులో డబ్బు జమ చేసి ఆ తర్వాత సరుకులు తీసుకోవాలంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఈ–పాస్ మెషిన్లు సరిగా పనిచేయక గంటల తరబడి రేషన్ షాపులవద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో 1.66 లక్షల కొత్తకార్డులు జన్మభూమి కార్యక్రమంలో ఇచ్చామని చెబుతున్నా అందులో సగానికి పైగా కార్డులకు రేషన్ నిలిపివేశారనే ఆరోపణలున్నాయి.
ఇలాగైతే ఎలా?
తూర్పు గోదావరి జిల్లా వెంకటాయపాలెం గ్రామానికి చెందిన అడపా సత్యవతికి కుష్టువ్యాధి ఉంది. నగదు రహిత రేషన్ తీసుకోవాలంటే ఈ–పాస్ లో వేలి ముద్రలు వేయడం తప్పనిసరి. ఆమె వేలి ముద్రలు సరిగా లేనందున ఈ–పాస్ స్వీకరించలేదు. ఈ విషయమై డీలర్.. తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్ల డంతో ఆమెకు మాత్రం రేషన్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వారే కాకుండా వయసు మీరి వేలి ముద్రలు సరిపోలక లక్షలాది మంది రేషన్ అందుకోలేకపోతున్నారు. పైగా బ్యాంకులో వారి ఖాతాల్లో డబ్బులుండేలా చూసుకుంటేనే ఇకపై రేషన్ అందుతుంది. లేదంటే లేదు.
ఈ–పాస్.. రేషన్ ఫెయిల్!
Published Tue, Feb 14 2017 3:26 AM | Last Updated on Thu, Sep 27 2018 4:59 PM
Advertisement
Advertisement