పెళ్లైన 24 గంటలు గడవకముందే...
ములకలచెరువు: చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లై 24 గంటలు గడవకముందే.. వరుడు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ సంఘటన జిల్లాలోని ములకలచెరువు మండలం గుడుపల్లెలో శనివారం వెలుగు చూసింది. వివరాలు.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మిద్ది నరసింహులు(22)కు గ్రామానికి చెందిన ప్రమీల(20)తో శుక్రవారం వివాహం జరిగింది. పెళ్లి అనంతరం సాంప్రదాయంలో భాగంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురి ఇంటికి వచ్చాడు. పడకగదిలో తన మొబైల్ చార్జింగ్ పెట్టి తీస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు యత్నిస్తుండగా అప్పటికే నరసింహులు చనిపోయాడు. శుక్రవారం ఎంతో సంతోషంగా.. అందరి ఆశ్వీరచనాలతో పెళ్లి చేసుకున్న నరసింహులు.. పెళ్లి దుస్తులు కూడా విప్పకముందే విగతజీవిగా మారడంతో స్తానికంగా తీవ్ర విషాదం నెలకొంది. నరసింహులు మృతితో ప్రమీల అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను ఆస్పత్రికి తరలించిన బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
