నీటమునిగిన చెన్నై నగరం
చెన్నై: గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చెన్నై స్తంభించిపోయింది. నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. పలుచోట్ల రోడ్లపై భారీ వృక్షాలు కూలిపోయాయి. ఆదివారం సాయంత్రం అతిభారీ స్థాయిలో 69 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. తమిళనాడులోని పలు జిల్లాల్లోనూ వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. పంటపోలాలు నీటమునిగాయి.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా ముఖ్యమంత్రి జయలలిత అత్యవసరంగా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. దెబ్బదిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సీఎం జయలలిత అధికారులను ఆదేశించారు. రెవెన్యూ మంత్రి ఆర్.బి. ఉదయ కుమార్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరదల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సోమవారం సెలవు ప్రకటించారు.
కాగా, భారీ వర్షాల కారణంగా పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు రూ. 4 ఎక్స్ గ్రెషియా చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆస్తినష్టం కలిగిన పేదలకు తక్షణ సాయంగా రూ. 20 వేలు అందజేయనున్నట్లు మంత్రి ఉదయ కుమార్ తెలిపారు. థేని, శివగంగా, దిండిగల్, నమక్కళ్ జిల్లాల్లో నష్టం పాళ్లు తీవ్రంగా ఉన్నట్లు తెలిసింది. అటు పాండిచేరి, లక్ష్యద్వీప్, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోని పలు తీరప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ కేంద్రం ప్రకటించింది.