- మొన్న గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల నుంచి తొలగింపు
- తర్వాత కార్మికశాఖ కేటాయింపు
- తాజాగా ఆ శాఖ కూడా గోవిందా!
హొసూరు న్యూస్‌లైన్: అన్నా డీఎంకే అధినేత్రి, సీఎం జయలలితకు ఎంతో విశ్వాసపాత్రుడిగా ఉన్న కృష్ణగిరి జిల్లా మంత్రి కేపీ మునిస్వామిపై వేటు పడింది. మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టిన జయలలిత ముగ్గురికి ఉద్వాసన పలికిన జయలలిత మరి కొందరి శాఖలను మార్చిన విషయం తెలిసింది.
ముఖ్యమంత్రికి నమ్మకమైన వ్యక్తులుగా ఉన్న నల్గురు మంత్రులలో కృష్ణగిరి జిల్లా మంత్రి కే.పి మునిస్వామి ఒకరు. ఈయన కృష్ణగిరి అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖలను నిర్వహించేవారు. మంత్రి వర్గమార్పులతో కే.పి.మునిస్వామికి షాక్ ఇచ్చిన జయలలిత ఆయనను గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖలను వెనక్కు తీసుకొని కార్మిక సంక్షేమశాఖను కేటాయించింది.
మంగళవారం తాజా పరిణామాలు చోటుచేసుకోగా మునిస్వామిని కార్మిక శాఖనుంచి కూడాతొలగించారు. అదేవిధంగా పార్టీ కృష్ణగిరి జిల్లా కార్యదర్శి పదవినుంచి, పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడి పదవినుంచి కూడా ఆయనను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కృష్ణగిరి స్థానం నుంచి అన్నాడీఎంకె అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలుపొందించడంలో కేపీ మునిస్వామి కృషి ఉంది.
అయితే ప్రతిష్టాత్మకమైన హొగేనకల్ పథకం అమలుపై ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాల విమర్శలను దీటుగా తిప్పికొట్టకపోవడం, కార్యకర్తలను, నాయకులను కలుపుకొని పోకపోవడం వల్లే ఆయనను మంత్రి పదవులకు దూరం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
గతంలో కృష్ణగిరి జిల్లాలో కల్తీసారా దుర్ఘటనలో 42 మంది మృతి చెందినఘటనకు సంబంధించి నిందితుల వద్ద మంత్రి డ బ్బు తీసుకుని కేసు మాపీ చేయించినట్లు ఇటీవల ఓ తమిళవారపత్రికలో కథనం ప్రచురితమైంది. శాఖల తొలగింపునకు ఇది కూడా ఒక కారణమై ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.