శివసేన ప్రతి ఏటా దాదర్‌లోని శివాజీపార్‌కలో నిర్వహించే దసరా ర్యాలీకి మంగళవారం ముంబై హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
సాక్షి, ముంబై: శివసేన ప్రతి ఏటా దాదర్‌లోని శివాజీపార్‌కలో నిర్వహించే దసరా ర్యాలీకి మంగళవారం ముంబై హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో శివసేన అధినేత బాల్‌ఠాక్రే మరణానంతరం మొట్టమొదటిసారిగా జరగనున్న దసరా ర్యాలీని శివాజీపార్‌కలో నిర్వహించేందుకు మార్గం సుగమమయింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన దసరా ర్యాలీ వేదికను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడినట్టయితే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని శివసేన నాయకులు భావించారు. అందుకే అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఎట్టకేలకు ఉన్నత న్యాయస్థానం శివసేనకు అనుకూలంగా తీర్పుచెప్పడంతోసేన కార్యకర్తల్లో ఆనందం నెలకొంది. గత నెలలో శివాజీపార్‌కలో దసరా ర్యాలీ నిర్వహించేందుకు శివసేన బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అనుమతి కోరింది. అయితే బీఎంసీ అనుమతి నిరాకరించిన విషయం విదితమే.
ర్యాలీ వేదిక ‘సెలైన్‌సజోన్’ పరిధిలోకి వస్తుంది కాబట్టి అనుమతి ఇవ్వడం కుదరదని కార్పొరేషన్ వివరణ ఇచ్చింది. దీంతో శివసేన ఈ సారి ర్యాలీని వేరే చోట నిర్వహిస్తుందని అంతా భావించారు. దసరాకు వారం రోజుల ముందు హైకోర్టు శివసేనకు అనుకూల నిర్ణయాన్ని ప్రకటించింది. సేన ప్రతి ఏటా దసరా సందర్భంగా శివాజీపార్కులో ర్యాలీ నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ఇక ర్యాలీకి భారీగా జనాన్ని సమీకరించడానికి సేన నాయకులు సమాయత్తమవుతున్నారు.