ప్రమాదపు ‘అంచుల్లో’ ప్రజలు
- 263 ప్రమాదకర కొండ ప్రాంతాలను గుర్తించిన అధికారులు
- చర్యలు ప్రారంభించని ప్రభుత్వం
సాక్షి ముంబై: వర్షకాలం సమీపిస్తున్న కొద్దీ కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలే వారి భయానికి ముఖ్య కారణం. గతేడాది కొండచరియలు విరిగిపడడంతో పుణే జిల్లాలోని మాలిన్ గ్రామం మొత్తం సమాధి అయ్యింది. ముంబైలోనూ పలుమార్లు కొండచరియలు విరిగిపడి, పాత భవనాలు కూలి అనేక మంది మృతి చెందిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ప్రమాదాలు జరుగుతున్నా అలసత్వం వదలని మునిసిపల్ కార్పొరేషన్, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటి వరకు నగరంలో సుమారు 263 ప్రాంతాలను ప్రమాదపు అంచున ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పుణే జిల్లా మాలిన్ గ్రామంలో జరిగినట్లు మరో ప్రమాదం జరిగితే నగరంలో భారీ ప్రాణనష్టం వాటిల్లే అవకాశం ఉంది.
వందలాది మంది మృతి....
కొండచరియలు విరిగిపడి ఇప్పటి వరకు వందలాది మంది వృుతి చెందారు. 2000 జులై 13 ఘట్కోపర్‌లో కొండచరియలు విరిగిపడి 67 మంది మరణించారు. 2009 సెప్టెంబరు 4న సాకినాకాలో జరిగిన మరో ఘటనలో 12 మంది మరణించారు. 2012 సెప్టెంబరు 3న చెంబూర్‌లో కొండచరియలు విరిగిపడినా అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. 2013 జులై 19న అంటప్‌హిల్‌లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. 2014 జులైలో చెంబూర్‌లో జరిగిన ఘటనలో ఐదేళ్ల బాలుడు మరణించాడు.