న్యూఢిల్లీ: ఇక నుంచి ఉచితంగానే జననమరణ ధ్రువపత్రాలు జారీ చేస్తామని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎమ్సీ) ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌లోనూ మార్పులు చేశామని ఎన్డీఎమ్సీ చైర్మన్ జలజ్ శ్రీవాత్సవ వెల్లడించారు. ఆస్పత్రిలో శిశువు పుట్టడం లేదా ఎవరైనా మరణించినా అక్కడే ధ్రువపత్రం నకలును ముద్రించుకునేందుకు కూడా యాజమాన్యాలకు అవకాశం ఇస్తున్నట్టు తెలియజేశారు. ఈ ధ్రువపత్రాలపై సంతకాలు చేసేందుకు ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయం కేటాయించే అధికారులను ఆస్పత్రులు నియమించగానే వాటికి అనుమతులు మంజూరు చేస్తామని శ్రీవాత్సవ వివరించారు.
ఈ విషయాలను వివరించేందుకు ఎన్డీఎమ్సీ జననాలు, మరణాల విభాగం ఇటీవల ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. ఎన్డీఎమ్సీ పరిధిలోని అన్ని ఆస్పత్రుల ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. వీరిలో ఎయిమ్స్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి, కళావతి సరణ్ ఆస్పత్రి, లేడీ హార్డింగ్ ఆస్పత్రి, సఫ్దర్‌జంగ్, శాంతి ఆవేదన, పాలికా మెటర్నిటీ, జేపీఎన్‌ఏ ట్రామా సెంటర్, నార్తర్న్ రైల్వే ఆస్పత్రి, చరక్ పాలికా ఆస్పత్రుల డాక్టర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శిశువు తల్లి, మృతుడి కుటుంబ సభ్యులకు జననమరణ ధ్రువీకరణ పత్రాలను ఉచితంగానే అందజేయాలని సుప్రీంకోర్టు, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆదేశించడంతో ఎన్డీఎమ్సీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఉచితంగానే సర్టిఫికెట్ల జారీ
Published Sun, Jun 22 2014 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 9:13 AM
Advertisement