
రైలు కాలుతుండగానే ఎలా తెలుసు?
తునిలో కాపు ఐక్యగర్జన నిర్వహిస్తుండగా విధ్వంసకాండ జరిగినప్పుడు ఒకవైపు రైలు తగలబడుతుండగానే అదే సమయంలో ఆ ఘటన వెనక ఎవరున్నారో ఏపీ సీఎం చంద్రబాబుకు ఎలా తెలుసని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. అప్పుడు రైలు కాలుతుండగానే చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఆ ఘటన వెనుక కాపులు లేరని.. కడప నుంచి వచ్చిన గూండాలు ఉన్నారని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సాధారణంగా ఎవరికీ అంత వెంటనే తెలియదని, విచారణ తర్వాత చెప్పాల్సి ఉందని.. కానీ రాజకీయ కక్షతో మొదటి రోజు నుంచి తమ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడేందుకే టీడీపీ సర్కారు ప్రయత్నించిందని మండిపడ్డారు. తుని ఘటనకు, వైఎస్ఆర్‌సీపీకి సంబంధం లేదని అందరికీ తెలుసని.. కానీ మోకాలికి, బోడిగుండుకు ముడిపెట్టి, వైసీపీ నేతృత్వంలో జరిగిందని అపవాదు తెచ్చి రాజకీయ కక్ష తీర్చుకోవాలని చంద్రబాబు ఇలా చేస్తున్నారన్నారు. భూమన కాల్‌డేటాలో ముద్రగడ నెంబరు ఉందన్న విషయమై అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఇందులో రహస్యం ఏమీ లేదని, భూమన స్వయంగా ముద్రగడను కలిసి.. ఆయన చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఉంటుందని చెప్పారని అన్నారు. ఆయనతో పాటు తాను కూడా అదే విషయం చెప్పానని, ముద్రగడ ఆశయాలను బలపరిచేవాళ్లు చాలామందే ఉన్నారని రాంబాబు తెలిపారు. సాక్షాత్తు తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డే కాపులను బీసీలలో చేర్చాలన్న ఉద్యమానికి తాము మద్దతిస్తున్నట్లు ప్రకటించారని గుర్తుచేశారు.
తునిలో జరిగిన విధ్వంసం జరగకూడని విషయమేనని, దానిపై వెంటనే న్యాయ విచారణ జరిపించి దోషులను శిక్షించాలని రాంబాబు అన్నారు. ఇక గుంటూరు సీఐడీ కార్యాలయం బయట రోడ్డుమీద ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లిపోవాలో అర్థం కాలేదన్నారు. వాస్తవానికి భూమన కరుణాకరరెడ్డి విచారణ మధ్యాహ్నం 3 గంటలకే అయిపోయినట్లు తమకు తెలిసిందని, కేవలం మానసిక ఒత్తిడి పెంచడానికే ఇలా ఎక్కువసేపు కూర్చోబెడుతున్నారని సమాచారం ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు పాలన మొత్తం పోలీసు రాజ్యంగానే సాగుతోందని.. కరుణాకరరెడ్డి మీద ఎలాంటి చర్య తీసుకున్నా మేం చట్టపరంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అందరూ ఇలా కక్షసాధింపు ధోరణితో కొనసాగితే ఇక తమిళనాడుకు, మనకు తేడా ఏముంటుందని అంబటి రాంబాబు ప్రశ్నించారు.