
‘శృతి’ మించిన కోర్కెలు
భర్తను బెదిరించిన భార్య
వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య
మైసూరు : కారు కొనివ్వడంతోపాటు తన చెల్లెలి ఉద్యోం కోసం లక్షల రూపాయల నగదు ఇవ్వాలని భార్య వేధించడంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం కర్ణాటకలోని మైసూరు నగరంలో ఆలస్యంగా ఆదివారం వెలుగు చూసింది. నగరంలోని విద్యాశంకర లేఅవుట్‌కు చెందిన మిథున్(28)కు మైసూరు నగరానికి చెందిన శృతి అనే యువతితో ఏడాది క్రితం వివాహమైంది. కొద్ది రోజుల తర్వాత భార్య వేధింపులు మొదలు పెట్టింది. తనకు కారు కొనివ్వాలని, తన చెల్లెలికి ఉద్యోగం ఇప్పించడానికి రూ.25 లక్షల డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసేది. మొదట్లో శృతి కోరికలను మిథున్ తేలిగ్గా తీసుకున్నాడు. అయితే రోజురోజుకు శృతి కోరికల జాబితా పెరిగిపోయింది. వాటిని తీర్చడం తనవల్ల కాదని మిథున్ చెప్పేవాడు.
తనకు కారుతో పాటు చెల్లెలి ఉద్యోగానికి డబ్బు ఇవ్వకుంటే మీతోపాటు మీ కుటుంబంపై కూడా అదనపు కట్నం వేధింపులు కేసు పెడతానంటూ బెదిరించడం ప్రారంభించింది. శృతి బెదిరింపులు తాళలేక మిథున్ ఈనెల 18న తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా కోడలు శృతి బెదిరింపులు, మానసికంగా వేధించడంతోనే తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు మిథున్ తండ్రి వెంకటేశ్‌గౌడ ఆదివారం ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.