- కళారంగంలో విశేష కృషి చేసిన వారికి అందజేయనున్న అఖిల కర్నాటక కమ్మవారి సంఘం
- వచ్చే విద్యా ఏడాది నుండి ఫైన్ ఆర్ట్స్ చదివే పేదవిద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు
- 23న ఎన్టీఆర్ క్యాలండర్ విడుదల, అక్కినేనికి శ్రద్ధాంజలి
సాక్షి, బెంగళూరు : కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కళారంగంలో విశేష కృషి చేసిన వారికి ‘ఎన్టీఆర్ కళారత్న’ అవార్డుకు ఎంపిక చేసి సత్కరించనున్నట్లు అఖిల కర్ణాటక కమ్మవారి సంఘం వెల్లడించింది. ఈ ఏడాది నుంచే ఈ అవార్డును అందించనున్నట్లు తెలిపింది. శుక్రవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి డి.వి.శేఖర్ మాట్లాడుతూ...పేద కళాకారులకు చేయూతనందించేందుకు, కళామతల్లికి విశేష సేవ చేసిన నందమూరి తారక రామారావు పేరిట ఈ అవార్డును నెలకొల్పినట్లు చెప్పారు.
అవార్డులో భాగంగా రూ.10వేల నగదు పురస్కారాన్ని అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఫైన్ ఆర్ట్స్ చదివే పది మంది నిరుపేద విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుండి స్కాలర్‌షిప్‌లు అందజేయనున్నట్లు తెలిపారు. వారి చదువుకు అయ్యే పూర్తి ఖర్చును సంస్థ తరఫున భరించనున్నట్లు చెప్పారు.
అనంతరం సంఘం అధ్యక్షుడు గారపాటి రామకృష్ణ మాట్లాడుతూ... ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా తమ సంఘం తరఫున ఎన్.టి.ఆర్ చిత్రాలతో కూడిన ప్రత్యేక క్యాలండర్‌ను ఈ నెల 23న ఔటర్‌రింగ్ రోడ్‌లోని నందన హోటల్‌లో ఎమ్మెల్యే మునిరత్నం నాయుడు ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. విలేకరుల సమావేశంలో సంఘం ఉపాధ్యక్షుడు కె.సురేష్‌బాబు, యువజన అధ్యక్షుడు జి.జగన్‌మోహన్ పాల్గొన్నారు.