ఢిల్లీలో దూకుడు పెంచిన స్టాలిన్
న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. అసెంబ్లీలో సీఎం పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న (గురువారం) రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసిన స్టాలిన్.. ఈ రోజు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశమయ్యారు. స్టాలిన్ పార్టీ నేతలతో కలసి సోనియా నివాసం జనపథ్ 10కు వెళ్లారు.
అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడులో ఇటీవల నెలకొన్న రాజకీయ పరిణామాలపై సోనియాతో చర్చించినట్టు చెప్పారు. పళనిస్వామి బలనిరూపణ సందర్భంగా అసెంబ్లీ నుంచి తమ పార్టీకి చెందిన 89 మంది ఎమ్మెల్యేలను బయటికి పంపించి ఓటింగ్ నిర్వహించారని, అసెంబ్లీ స్పీకర్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని, ఈ విషయాలను సోనియా దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరిని కూడా స్టాలిన్ కలిసే అవకాశం ఉంది. సీక్రెట్ బ్యాలట్ పద్ధతిలో మళ్లీ బలపరీక్ష నిర్వహించాలని స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారు.