బెంగళూరు, న్యూస్‌లైన్ : ఆంధ్రుల దెబ్బ ఎలా ఉంటుందో వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికలలో తెలుస్తుందని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఇక్కడి కనిష్క హోటల్‌లో కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి నాయకత్వంలో జరిగిన జై సమైక్యాంధ్ర చర్చాగోష్టి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కొందరు స్వార్థ రాజకీయాల కోసం తెలుగు జాతిని విభజిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశంలోని 140 పార్లమెంట్ నియోజక వర్గాలలో తెలుగు వారి ఓట్లు ఉన్నాయని గుర్తు చేశారు.
1959, 1969లలో తెలంగాణ ఉద్యమం జరిగినా సమైక్య వాదమే గెలిచిందని అన్నారు. 1972లో మళ్లీ తలెత్తినా, సమైక్యాంధ్ర ఉద్యమం గెలిచిందని గుర్తు చేశారు. అనంతరం 2002 వరకు విభజన వాదం ఎప్పుడూ విన బడలేదన్నారు. టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్ మళ్లీ ఆ వాదనతో ఉద్యమాలు చేపట్టారని తెలిపారు. 2004లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టీఆర్‌ఎస్ 53 స్థానాల్లో పోటీ చేసి కేవలం 26 స్థానాలు మాత్రమే సాధించిందని గుర్తు చేశారు. అప్పట్లో టీడీపీపై వ ్యతిరేకత, కాంగ్రెస్‌తో పొత్తు లాంటి అంశాలు టీఆర్‌ఎస్‌కు కలసి వచ్చాయని చె ప్పారు. అనంతరం కాంగ్రెస్‌తో పడక పోవ డంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సామూహికంగా రాజీనామా చేశారని తెలిపారు.
2008లో జరిగిన ఉప ఎన్నికలలో 18 స్థానాలలో పోటీ చేసిన టీఆర్‌ఎస్ కేవలం ఏడు స్థానాలలో గెలిచిందని తెలిపారు. 2009లో జరిగిన శాసన సభ ఎన్నికలలో టీడీపీ, టీఆర్‌ఎస్, వామపక్షాలు కలిసి మహా కూటమిని ఏర్పాటు చేసుకున్నా, తెలంగాణలో 40 స్థానాలలో పోటీ చేసిన టీఆర్‌ఎస్‌కు కేవలం పదే స్థానాలు లభించాయని చెప్పారు. తెలంగాణ వాదానికి ఆ ప్రాంత ప్రజల మద్దతు లేదని చెప్పడానికే తాను గతాన్ని వివరించాల్సి వచ్చిందని అన్నారు. హైదరాబాద్ సమీపంలోని చిన్న గ్రామంలో నివాసం ఉంటున్న తన ఇంటి మీద తెలంగాణ న్యాయవాదులు దాడి చేసిన సమయంలో అదే గ్రామంలో ఉన్న తెలంగాణ ప్రజలు వారిని అడ్డుకున్నారని, తన తల్లి, కుమార్తెలను రక్షించారని ఆయన తెలిపారు.
సీమాంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు పులిగొజ్జు సురేష్ మాట్లాడుతూ... 1956లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడి క్రమంగా బలమైన రాష్ర్టంగా అవతరిస్తుండడంతో చాలా మందికి కన్ను కుట్టిందని ఆరోపించారు. తెలుగు జాతిని విడదీస్తే ప్రజలు మీకు సమాధి కడతారని రాజకీయ నాయకులను హెచ్చరించారు. బొందు రామస్వామి మాట్లాడుతూ ... మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరించి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రాన్ని విడదీస్తున్న నాయకులను భావి తరాలు క్షమించవని హెచ్చరించారు. ఎంగిలి మెతుకుల కోసం రాజకీయ నాయకులు కేంద్రం చేతిలో కీలు బొమ్మలుగా మారారని విమర్శించారు.
తెలంగాణలోనే విభజనకు వ్యతిరేకత
Published Mon, Oct 28 2013 2:15 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement