అభిమానం అంటే అదే!
అభిమానులు లేనిదే హీరోలు లేదులే అంటూ హీరో వెంకటేష్ ఒక పాటలో అంటారు. అందుకే వాళ్లను ప్రేక్షక దేవుళ్లగా నటీనటులు భావి స్తారు. అభిమానం అనేది వెలకట్టలేనిది. కొందరి అభిమానం మధురంగా మనసు మీటుతుంది. ఇలియానా అనూహ్యంగా ఇలాంటి అనుభూతినే పొందారు. ఇంతకుముందు తెలుగు చిత్ర పరిశ్రమను తన అందచందాలతో ఊపేసిన ఇలియానా, ప్రస్తుతం తన సౌందర్య సంపదతో బాలీవుడ్ ప్రేక్షకులను రంజింప చేస్తున్నారు. అక్కడ హీరోయిన్‌గా ఆమె పరిస్థితి ఎలా వున్నా తన ముగ్ధ మనోహర రూపానికి చాలామంది అభిమానులు ఫ్లాట్ అయిపోతున్నారు.
ఇటీవల జరిగిన ఒక సంఘటన ఇందుకు ఉదాహరణ. మెరుపుతీగ ఇలియానా ముంబయి విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యారు. దీంతో ఈమెను చూడటానికి అభిమానగణం చుట్టుముట్టారు. అలాంటి కలకల వాతావరణంలో ఒక అభిమాని ఇలియానా ముందుకు దూసుకొచ్చి ఒక చీటి ముక్కను ఆమె చేతిలో పెట్టి కొంచెం సేపు తరువాత చదవమని వెళ్లిపోయాడు. అందులో ఏమి రాశాడు అంటూ అక్కడి వారడిగిన ప్రశ్నలకు అప్పుడు ఇలియానా బదులివ్వలేదు. ఆ అభిమాని చీటిలోని సారాంశాన్ని ఇలియానా తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసి ముచ్చటపడ్డారు.
‘‘హే ఇలియానా తెరపైనా అయినా నేరుగా అయినా చూడటానికి అందంగా ఉంటారు. మీరు నటించిన బర్ఫీ చిత్రం నాకు చాలా బాగా నచ్చింది. అందులో మీ నటన ప్రశంసనీయంగా ఉంది. సినీ రంగంలో మీరు పయనించాల్సిన దూరం చాలా ఉంది.’’అని ఆ అభిమాని చీటి ముక్కలో పేర్కొన్న విషయం. ఇందులో అంత గొప్పగా అభినందించిందేముంది అని అడిగితే, అయితే ఆ అభిమాని చిన్న చీటి ముక్కలో తన స్వహస్తాలతో అభినందిస్తూ రాయడం తనకు బాగా నచ్చిందని ఏదేమైనా ఆ చీటి తన మనసు లోతుల్ని హాయిగా తాకిందని ఇలియానా పేర్కొన్నారు. నిజమైన అభిమానికి సరైన నిర్వచనం ఇదేనేమో.