ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు
తీవ్రంగా గాయపడిన దంపతులు, కుమారుడు
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లీ కుమారుడి మృతి
బెంగళూరు(బనశంకరి) : కుటుంబం గాఢనిద్రలో ఉండగా దుండగులు నిప్పు పెట్టిన ఘటనలో తల్లితో పాటు కుమారుడు మృతిచెందగా ఇంటి పెద్ద తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన రాష్ర్ట రాజధానికి 150 కిలోమీటర్ల దూరంలోని తావరకెరె పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు..... మాగడి తాలూకా మంచినబెలెలో భోజన్న, విజయలక్ష్మి(45) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి భరత్(19)అనే కుమారుడున్నాడు. భూముల విషయంలో అదే గ్రామానికి చెందిన కొందరితో వీరికి వివాదం నెలకొంది.
ఈక్రమంలో భోజన్న, విజయక్ష్మి, భరత్ గాఢనిద్రలో ఉండగా శనివారం వేకువజామున మూడుగంటల సమయంలో దుండగులు ఆ ఇంటి తలుపునకు గడియ వేసి తర్వాత ఇంటిపై కిరోసిన్ చల్లి నిప్పుపెట్టి ఉడాయించారు. ఉవ్వెత్తున మంటలు ఎగసి ఇళ్లంతా వ్యాపించడంతో అందులో ఉన్న కుటుంబసభ్యులు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు మేల్కొని భోజన్నను లక్కసంద్రలోని అభయ్ ఆసుపత్రికి, విజయలక్ష్మిని విక్టోరియా ఆస్పత్రికి, భరత్‌ను సెయింట్‌జాన్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ తల్లీ కుమారుడు మృతి చెందగా భోజన్న పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై తావరకెరె పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల ఆచూకీకోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
మంచినబెలెలో అమానుషం
Published Mon, Feb 22 2016 2:22 AM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM
Advertisement
Advertisement