నాగ్‌పూర్‌లో సోలార్ మెట్రో రైలు..?
- సిద్ధమైన నాగ్‌పూర్ మెట్రో రైల్వే కార్పొరేషన్
- ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు భరించనున్న జర్మనీ
- వెల్లడించిన కార్పొరేషన్ ఎండీ బ్రిజేష్ దీక్షిత్
సాక్షి, ముంబై: ప్రపంచంలోనే మొట్టమొదటి సోలార్ మెట్రో రైలు త్వరలో నాగ్‌పూర్‌లో పరుగెత్తనుంది. ఇందుకు సంబంధించిన పనులు తొందర్లోనే ప్రారంభం కానున్నాయి. దేశంలోని పలు నగరాల్లో ప్రస్తుతం మెట్రో రైల్వే పనులు కొనసాగుతుండగా మరికొన్ని చోట్ల పనులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే నాగ్‌పూర్‌లో మాత్రం సోలార్ మెట్రో రైలును ప్రవేశపెట్టేందుకు నాగ్‌పూర్ మెట్రో రైల్వే కార్పొరేషన్ సిద్ధమైంది. రూ. 200 కోట్ల ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించేందుకు జర్మనీ ముందుకు వచ్చినట్టు కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ బ్రిజేష్ దీక్షిత్ తెలిపారు. ఇండో-జర్మనీ సోలార్ కో-ఆపరేషన్‌లో భాగంగా ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం మే చివరి వారంలో జర్మనీకి చెందిన సాంకేతికృబందం నాగ్‌పూర్‌కు రానుంది. అదే సమయంలో సోలార్ మెట్రో ప్రాజెక్టుకు ఆర్థిక సహాయానికి సంబంధించిన విషయంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రతి రైల్వేస్టేషన్ తోపాటు రెండు మెట్రో రైలు డిపోలపై సోలార్ ప్యానల్స్‌ను అమర్చనున్నారు. రైల్వే స్టేషన్ల నిర్మాణం కూడా అందుకు అనుగుణంగానే చేయనున్నారు. ఈ సోలార్ ప్లేట్ల ద్వారా సుమారు 30 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. అవసరం అయిన మొత్తం విద్యుత్‌లో 40 శాతం మెట్రో రైల్వేస్టేషన్‌ల నుంచే లభించనుంది.
వరంగా మారనున్న ఎండ...
నాగ్‌పూర్‌లో భానుడి తీవ్రత చాలా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి ఏడాది ప్రధానంగా వేసవిలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటిపోతుంది. ఇప్పుడు ఈ భగభగ మండే ఎండలే సోలార్ మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి వరంగా మారాయి. సోలార్ ఎనర్జీ ద్వారా మెట్రో రైలు ప్రారంభమైతే ప్రపంచంలోనే తొలి సోలార్ మెట్రోగా నాగ్‌పూర్ నగరం చరిత్రకెక్కనుంది.