స్వాతంత్య్ర దినోత్సవానికి ముస్తాబైన రాష్ట్రం
Published Thu, Aug 15 2013 3:11 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM
స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు రాష్ట్రం ముస్తాబైంది. జాతీయ జెండాను ఊరూవాడా ఎగురవేయనున్నారు. చెన్నైలో జరిగే వేడుకల్లో ముఖ్యమంత్రి జయలలిత పాల్గొననున్నారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది.
చెన్నై, సాక్షి ప్రతినిధి : స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం జరగనున్నాయి. రంగురంగుల దీపాలతో రాష్ట్ర సచివాలయూ న్ని ముస్తాబు చేశారు. ముఖ్యమంత్రి జయలలిత సచివాలయ సమీపంలోని అమరజవాన్ల స్తూపం వద్ద గురువారం ఉదయం శ్రద్ధాంజలి ఘటిస్తారు. తర్వాత సచివాల యం చేరుకుని జాతీయ జెండా ఎగురవేస్తా రు. వేడుకల దృష్ట్యా సచివాలయానికి వెళ్లే బీచ్‌రోడ్డులోని ట్రాఫిక్‌ను మళ్లించారు. అదే విధంగా ముఖ్యమంత్రి ఇంటికి చేరే మార్గమంతా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు కవాతు, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రచార రథాలు తదితరాలకు సంబంధించి మంగళవారం రిహార్సల్స్ చేశారు. అయితే బుధవారం తెల్లవారుజాము నుంచి నగరంలో కుండపోతగా వర్షం కురుస్తుండడంతో పోలీసు కవాతు, ఇతర కార్యక్రమాల నిర్వహణపై అయోమయం నెలకొంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోం’ పేరుతో గవర్నర్ రోశయ్య విందు ఏర్పాటు చేశారు. గవర్నర్ రోశయ్య, ముఖ్యమంత్రి జయలలిత, వివిధ పార్టీల నేతలు విజయకాంత్, శరత్‌కుమార్, డాక్టర్ రాందాస్ తదితరులు ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
నిఘా కట్టుదిట్టం
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తీవ్రవాదులు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించనున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది పోలీసులు బందోబస్తుకు దిగారు. నిఘా విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం చూపినా కఠిన చర్యలు తప్పవని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చెన్నై నుంచి కన్యాకుమారి వరకు అన్ని జిల్లాల ఎస్పీలను అప్రమత్తం చేశారు. సముద్రతీరంలో అత్యాధునిక నౌకలతో 24 గంటల గస్తీ చేపట్టారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయూల వద్ద నిఘా పెట్టారు. కోయంబేడు బస్‌స్టేషన్‌లోని 8 ద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్లు, 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
మూడు వందల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయూణికులు, పార్శిళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే చెన్నై సెంట్రల్, ఎగ్మూర్, బేసిన్‌బ్రిడ్జి, మాంబళం, తాంబరం, తిరువళ్లూరు, అరక్కోణం, కాట్పాడి, మదురై జంక్షన్ తదితర 14 లోకల్ రైల్వేస్టేషన్లలో రూ.41.6 కోట్లతో సీసీ కెమెరాలు అమర్చారు. చెన్నై ఎయిర్‌పోర్టులో బుధవారం సాయంత్రం ఒక బ్యాగ్ కలకలం రేపింది. బ్యాగ్ ఒక్కటే ఉండడంతో ప్రయూణికులు ఆందోళన చెందారు. దీంతో బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగింది. బ్యాగులో ఏమీలేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వీరికే పతకాలు
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎనిమిది మంది పోలీసు అధికారులకు ఉత్తమ సేవా పతకాలను ప్రకటించారు. గుణశేఖరన్, ధనరాజ్, రాజ్‌కుమార్, చిదంబర మురుగేశన్, విజయేంద్ర, విజయన్, శ్రీధరన్, కుమార్ ముఖ్యమంత్రి జయలలిత చేతుల మీదుగా పతకాలు స్వీకరించనున్నారు.
Advertisement
Advertisement