న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అధిక సీట్లు రావచ్చని, ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలవవచ్చని ఇండియా టుడే గ్రూప్, సిసెరో ఢిల్లీ చేపట్టిన అభిప్రాయ సేకరణలో వెల్లడైంది. ముఖ్యమంత్రిగా మాత్రం అర్వింద్ కేజ్రీవాల్ ఉండాలని ఢిల్లీవాసుల్లో అత్యధికులు కోరుకుంటున్నారు. ఈ విషయంలో బీజేపీకి చెందిన హర్షవర్ధన్ రెండో స్థానంలో నిలిచారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం పని తీరు ప్రభావం చూపనుందని, తద్వారా బీజేపీ లబ్ధి పొందగలదని ఆ సర్వే అంచనా వేసింది. బీజేపీ 39 శాతం ఓట్లను పొంది ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని, 36 శాతం ఓట్లతో ఆప్ రెండో స్థానంలో ఉంటుందని ఆ సర్వే పేర్కొంది. ముఖ్యమంత్రి పదవికి 35 శాతం కేజ్రీవాల్‌ను ఎన్నుకోగా, 19 శాతం మాత్రమే హర్షవర్ధన్‌కు మద్దతు పలికారు. ప్రభుత్వాన్ని నడపడానికి బదులు నిరసనలు, ఆందోళనలపైనే కేజ్రీవాల్ దృష్టి కేంద్రీకరించారని 54 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని పాలించే అవకాశం అతనికే ఇవ్వాలని 55 శాతం మంది చెప్పారు.
ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4,273 ఓటర్లను ప్రశ్నించి ఈ వివరాలు సేకరించారు. ఈ ఎన్నికల్లో ఆప్‌కు ఒక శాతం, బీజేపీకి 5.9 శాతం ఓట్లు పెరుగుతాయని ఆ సర్వే అంచనా వేసింది. కాగా కాంగ్రెస్‌కు 8.5 శాతం ఓట్లు తగ్గుతాయని తెలిపింది. ఈ ఎన్నికల్లో అవినీతి ప్రధాన అంశం కానుంది. అవినీతిని అరికట్టే వారికే పట్టం గడతామని 21 శాతం మంది తేల్చి చెప్పారు. మరో చర్చనీయాంశమైన మహిళల భద్రతకు 17 శాతం మంది ప్రాముఖ్యతనిచ్చారు. 15 శాతం తాగునీటిని, 12 శాతం మంది ద్రవ్యోల్బణాన్ని, కరెంటు సమస్యను పది శాతం మంది ప్రాధాన్యత అంశాలుగా చెప్పారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు పాలన దేశంలోని ఏ ఇతర రాష్ట్రం కన్నా ఢిల్లీపై అధిక ప్రభావం చూపగలదని ఆ సర్వే తెలిపింది. మోడీ సర్కారు ఊహించినదాని కన్నా బాగా పని చేస్తోందని 34 శాతం పేర్కొనగా, తమ ఊహలకు దగ్గరగా ఉందని 33 శాతం మంది చెప్పారు.
ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్ పాలన తమ ఊహలను మించిపోయిందని 35 శాతం మంది అభిప్రాయపడ్డారు. తాము ఆశించిన విధంగానే ఆప్ సర్కారు పని చేసిందని 32 శాతం మంది చెప్పగా, తమ ఆశలను నీరుగార్చిందని 22 శాతం మంది అన్నారు. కేజ్రీవాల్ తన బాధ్యతల (సీఎం పదవి) నుంచి పారిపోయాడని, ఇందుకు అతడిని క్షమించలేమని 55 శాతం మంది అన్నారు. అయితే 49 రోజుల పాలనా కాలంలో అవి నీతిని తగ్గించాడని 60 శాతం మంది ప్రశంసించారు. విద్యుత్, నీటి చార్జీలను తగ్గించాడని వారు చెప్పారు. సర్వేలో పాల్గొన్న 70 శాతం మంది కాంగ్రెస్‌ను అవినీతి పార్టీ అని, బంధు ప్రీతిని ప్రోత్సహిస్తుందని 51 శాతం మంది పేర్కొన్నారు.
కమలం వికసిస్తుంది
Published Sat, Dec 20 2014 10:50 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement