ఆగస్టులో బ్యాడ్మింటన్ సెలబ్రిటీ లీగ్
- సందడి చేయనున్న
- క్రీడాకారులు, సినీతారలు
- చెన్నై నెహ్రూ స్టేడియం వేదిక
- యువ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యం
కొరుక్కుపేట, న్యూస్‌లైన్: బ్యాడ్మింటన్ క్రీడాకారులు, సినీ తారలు కలిసి సందడి చేసేందుకు నగరంలో ఆగస్టు 8, 9, 10 తేదీల్లో ఇండియన్ బ్యాడ్మింటన్ సెలబ్రిటీ లీగ్ (ఐబీసీఎల్)ను నిర్వహించనున్నారు. దీనికి చెన్నై, నెహ్రూ స్టేడియం వేదికకానుంది. ఈ మేరకు శుక్రవారం నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన సమావేశంలో ఐబీసీఎల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్, ఐఈసీఎల్ బ్రాండ్ అంబాసిడర్ పి.వి. సింధూ, ప్రముఖ సినీ డెరైక్టర్ వెంకట్ ప్రభు హాజరై లోగోను ఆవిష్కరించారు. ఐబీసీఎల్ డెరైక్టర్, సీఈఓ హేమచంద్రన్ మాట్లాడుతూ తమిళనాడు బ్యాడ్మింటన్ అసోసియేషన్, రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3230, టై చెన్నైలతో కలిసి యువ క్రీడాకారులను ప్రోత్సహించేలా ఇండియన్ బ్యాడ్మింటన్ సెలెబ్రిటీ లీగ్ నిర్వహిస్తున్నామన్నారు.
సినీ తారలు, టెక్నీషియన్‌లు, గాయనీగాయకులతో కలసి బ్యాడ్మిం టన్ క్రీడాకారులు లీగ్‌లో ఆడనున్నారని తెలిపారు. ఇందులో పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ అంటూ మూడు కేటగిరిలలో జరుగనున్నాయి. ఇందులో సినీ తారలు అజిత్, జననీ అయ్యర్, వెంకట్ ప్రభు, ఆది, నితిన్ సత్య, నమిత తదితర తారలు, టెక్నిషియన్‌లు, గాయకులు పాల్గొననున్నారన్నారు.
అనంతరం ఐబీసీఎల్ చైర్మ న్ మౌళి మదన్ మాట్లాడుతూ ఆర్థికంగా వెనకబడిన యువ క్రీడాకారుల ప్రతిభ ను గుర్తించి ప్రోత్సహించేలా ఐబీసీఎల్ వేదిక కానుందన్నారు. ప్రస్తుతం బ్యాడ్మింటన్ క్రీడకు మంచి ఆదరణ లభిస్తుందన్నారు. పి.వి సింధూ మాట్లాడుతూ సెలబ్రిటీలతో క్రీడాకారులు కల సి బ్యాడ్మింటన్ క్రీడను ఏర్పాటు చేయ డం సంతోషంగా ఉందన్నారు. యువ క్రీడాకారులు మరింత మంది వెలుగులోకి వచ్చేందుకు ఇదో మంచి అవకాశం అని, ఐబీసీఎల్ సక్సెస్ సాధించాలని కోరారు. తమిళనాడు బ్యాడ్మింటన్ అసోసియేషన్ కోచ్ మారన్, సెక్రటరీ అశోక్ బాలాజీ పాల్గొన్నారు.