Nehru Stadium
-
భారత్‌కు భంగపాటు
భారత్ ముందు 300కు పైగా పరుగుల విజయలక్ష్యం. గత కొన్నాళ్లుగా వన్డేల్లో, అదీ సొంతగడ్డపై మన జట్టు ఆటను బట్టి చూస్తే ఇది అసలు లెక్కలోకే రాదు. దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్‌తో ఇంతకంటే ఎంతో పెద్ద స్కోర్లను మనోళ్లు అలవోకగా ఛేదించి పడేశారు. ఈసారి ప్రత్యర్థి చూస్తే బలహీన జట్టు. వార్మప్‌లలో కుర్రాళ్ల చేతిలోనూ కుదేలైంది. ఇంకేముంది... ధోని సేన గెలుపు లాంఛనమే అనిపించింది. అయితే అన్ని అంచనాలను వెస్టిండీస్ తలకిందులు చేసింది. స్ఫూర్తిదాయక ఆటతీరుతో ధోని సేనను చిత్తు చేసింది. కొచ్చి: తొలి వన్డే ప్రారంభమయ్యే వరకు కూడా వెస్టిండీస్ ఆడుతుందో, లేదో అని సందేహం... కానీ కష్టాలు, ఆలోచనలు అన్నీ పక్కనపెట్టి బరిలోకి దిగిన కరీబియన్లు... ఆటతోనే తమ బోర్డుకు సమాధానం చెప్పారు. బుధవారం ఇక్కడి నెహ్రూ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 124 పరుగుల తేడాతో భారత్నుచిత్తుగా ఓడించి ధోని సేనకు సిరీస్‌లో పెను సవాల్ విసిరారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మార్లోన్ శామ్యూల్స్ (116 బంతుల్లో 126 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగగా, కీపర్ రామ్‌దిన్ (59 బంతుల్లో 61; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అతనికి సహకరించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 23.1 ఓవర్లలో 165 పరుగులు జోడించారు. అనంతరం భారత్ 41 ఓవర్లలో 197 పరుగులకే ఆలౌటైంది. శిఖర్ ధావన్ (92 బంతుల్లో 68; 9 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విండీస్ చేతిలో భారత్‌కు ఇది రెండో అతి పెద్ద పరాజయం. 2002లో 135 పరుగుల తేడాతో (విజయవాడలో) ఓడినప్పుడు కూడా శామ్యూల్స్ సెంచరీ చేశాడు. తాజా ఫలితంతో ఐదు వన్డేల సిరీస్‌లో విండీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే శనివారం న్యూఢిల్లీలో జరుగుతుంది. భారీ భాగస్వామ్యం... ఎప్పటిలాగే భువనేశ్వర్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆరంభంలో వెస్టిండీస్‌ను కట్టడి చేశాడు. అయితే డ్వేన్ స్మిత్ (45 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజ్‌లో నిలదొక్కుకొని, కెప్టెన్ డ్వేన్ బ్రేవో (17), డారెన్ బ్రేవో (28)లతో కలిసి కీలక పరుగులు జోడించాడు. విండీస్ తొలి పవర్ ప్లేలో విండీస్ 52 పరుగులు చేసింది. 11వ ఓవర్లో స్మిత్‌ను అవుట్ చేసి జడేజా బ్రేక్ అందించాడు. అనంతరం శామ్యూల్స్, రామ్‌దిన్ జత కలిశారు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో ఆడుతూ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. శామ్యూల్స్ 58 బంతుల్లో, రామ్‌దిన్ 52 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరి జోరు మరింత పెరిగింది. శామ్యూల్స్ 99 బంతుల్లోనే కెరీర్లో ఆరో సెంచరీని పూర్తి చేసుకున్న శామ్యూల్స్ ఈ మ్యాచ్‌లో 4 వేల పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. భారత్ తరఫున ముగ్గురు స్పిన్నర్లు కలిపి 22 ఓవర్లలో 144 పరుగులు సమర్పించుకున్నారు. ధావన్ ఒక్కడే... భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ధావన్, రహానే (24) కలిసి చెప్పుకోదగ్గ ఆరంభాన్ని అందించారు. అయితే రెండో పరుగు కోసం ప్రయత్నించే క్రమంలో సమన్వయ లోపంతో రహానే రనౌట్ కావడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. కోహ్లి (2) చెత్త ఫామ్ భారత్‌లోనూ కొనసాగింది. టేలర్ బౌలింగ్‌లో స్లిప్స్‌లోనే క్యాచ్ ఇచ్చి అతను వెనుదిరిగాడు. భారత్‌లో తొలి వన్డే ఆడుతున్న రాయుడు (13)కు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ లభించినా, పేలవ షాట్‌తో దానిని ఉపయోగించుకోలేకపోగా... బ్రేవో అద్భుత బంతికి రైనా (0), స్యామీ బౌలింగ్‌కు ధోని (8) క్లీన్‌బౌల్డయ్యారు. మరోవైపు ఒంటరి పోరాటం చేసిన ధావన్ 71 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అతను అవుట్ కావడంతో భారత్ మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకుంది. చివర్లో జడేజా (36 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించినా లక్ష్యానికి చాలా దూరంలో భారత్ నిలిచిపోయింది. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: స్మిత్ (బి) జడేజా 46; డ్వేన్ బ్రేవో (సి) ధావన్ (బి) షమీ 17; డారెన్ బ్రేవో (సి) ధావన్ (బి) మిశ్రా 28; శామ్యూల్స్ (నాటౌట్) 126; రామ్‌దిన్ (సి) జడేజా (బి) షమీ 61; పొలార్డ్ (బి) షమీ 2; రసెల్ (సి) కోహ్లి (బి) షమీ 1; స్యామీ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 30; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 321 వికెట్ల పతనం: 1-34; 2-98; 3-120; 4-285; 5-296; 6-298. బౌలింగ్: భువనేశ్వర్ 10-1-38-0; మోహిత్ 9-0-61-0; షమీ 9-1-66-4; జడేజా 10-0-58-1; మిశ్రా 10-0-72-1; రైనా 2-0-14-0. భారత్ ఇన్నింగ్స్: రహానే (రనౌట్) 24; ధావన్ (బి) శామ్యూల్స్ 68; కోహ్లి (సి) స్యామీ (బి) టేలర్ 2; రాయుడు (సి) బెన్ (బి) రసెల్ 13; రైనా (బి) డ్వేన్ బ్రేవో 0; ధోని (బి) స్యామీ 8; జడేజా (నాటౌట్) 33; భువనేశ్వర్ (సి) స్యామీ (బి) శామ్యూల్స్ 2; మిశ్రా (ఎల్బీ) (బి) డ్వేన్ బ్రేవో 5; మోహిత్ (సి) టేలర్ (బి) రామ్‌పాల్ 8; షమీ (బి) రామ్‌పాల్ 19; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (41 ఓవర్లలో ఆలౌట్) 197 వికెట్ల పతనం: 1-49; 2-55; 3-82; 4-83; 5-114; 6-134; 7-138; 8-146; 9-155; 10-197. బౌలింగ్: రామ్‌పాల్ 8-0-48-2; టేలర్ 10-1-50-1; డ్వేన్ బ్రేవో 6-0-28-2; రసెల్ 4-0-21-1; బెన్ 5-0-16-0; స్యామీ 5-0-23-1; శామ్యూల్స్ 3-0-10-2. -
ఆగస్టులో బ్యాడ్మింటన్ సెలబ్రిటీ లీగ్
- సందడి చేయనున్న - క్రీడాకారులు, సినీతారలు - చెన్నై నెహ్రూ స్టేడియం వేదిక - యువ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యం కొరుక్కుపేట, న్యూస్‌లైన్: బ్యాడ్మింటన్ క్రీడాకారులు, సినీ తారలు కలిసి సందడి చేసేందుకు నగరంలో ఆగస్టు 8, 9, 10 తేదీల్లో ఇండియన్ బ్యాడ్మింటన్ సెలబ్రిటీ లీగ్ (ఐబీసీఎల్)ను నిర్వహించనున్నారు. దీనికి చెన్నై, నెహ్రూ స్టేడియం వేదికకానుంది. ఈ మేరకు శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో జరిగిన సమావేశంలో ఐబీసీఎల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్, ఐఈసీఎల్ బ్రాండ్ అంబాసిడర్ పి.వి. సింధూ, ప్రముఖ సినీ డెరైక్టర్ వెంకట్ ప్రభు హాజరై లోగోను ఆవిష్కరించారు. ఐబీసీఎల్ డెరైక్టర్, సీఈఓ హేమచంద్రన్ మాట్లాడుతూ తమిళనాడు బ్యాడ్మింటన్ అసోసియేషన్, రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3230, టై చెన్నైలతో కలిసి యువ క్రీడాకారులను ప్రోత్సహించేలా ఇండియన్ బ్యాడ్మింటన్ సెలెబ్రిటీ లీగ్ నిర్వహిస్తున్నామన్నారు. సినీ తారలు, టెక్నీషియన్లు, గాయనీగాయకులతో కలసి బ్యాడ్మిం టన్ క్రీడాకారులు లీగ్‌లో ఆడనున్నారని తెలిపారు. ఇందులో పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ అంటూ మూడు కేటగిరిలలో జరుగనున్నాయి. ఇందులో సినీ తారలు అజిత్, జననీ అయ్యర్, వెంకట్ ప్రభు, ఆది, నితిన్ సత్య, నమిత తదితర తారలు, టెక్నిషియన్లు, గాయకులు పాల్గొననున్నారన్నారు. అనంతరం ఐబీసీఎల్ చైర్మ న్ మౌళి మదన్ మాట్లాడుతూ ఆర్థికంగా వెనకబడిన యువ క్రీడాకారుల ప్రతిభ ను గుర్తించి ప్రోత్సహించేలా ఐబీసీఎల్ వేదిక కానుందన్నారు. ప్రస్తుతం బ్యాడ్మింటన్ క్రీడకు మంచి ఆదరణ లభిస్తుందన్నారు. పి.వి సింధూ మాట్లాడుతూ సెలబ్రిటీలతో క్రీడాకారులు కల సి బ్యాడ్మింటన్ క్రీడను ఏర్పాటు చేయ డం సంతోషంగా ఉందన్నారు. యువ క్రీడాకారులు మరింత మంది వెలుగులోకి వచ్చేందుకు ఇదో మంచి అవకాశం అని, ఐబీసీఎల్ సక్సెస్ సాధించాలని కోరారు. తమిళనాడు బ్యాడ్మింటన్ అసోసియేషన్ కోచ్ మారన్, సెక్రటరీ అశోక్ బాలాజీ పాల్గొన్నారు. -
వందేళ్ల సినిమా వేడుకలో రెండో రోజు
చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఆదివారం సాయంత్రం ప్రారంభమైన శత వసంతాల భారతీయ సినిమా వేడుకల్లో రెండో రోజు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, కేంద్రమంత్రి చిరంజీవి హాజరు కాలేదు. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డీకే అరుణ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. తెలుగు సినీ దిగ్గజాలైన అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణ రావు, కృష్ణ సైతం హాజరు కాలేదు. డా. డి.రామానాయుడు, కృష్ణంరాజు, బాలకృష్ణ, వెంకటేశ్, రాజేంద్రప్రసాద్, రాజశేఖర్ , సురేష్‌బాబు, అల్లు అరవింద్, మురళీమోహన్, కోట శ్రీనివాసరావు, బాబుమోహన్, శ్రీకాంత్, మనోజ్, రానా, ఆది, కృష్ణకుమారి, వాణిశ్రీ, జయసుధ, జయప్రధ, రాధ, చార్మి, మంచు లక్ష్మీ ప్రసన్న తదితరులు హాజరయ్యారు. సమాచార మంత్రి డీకే అరుణ, మంత్రి గంటా శ్రీనివాసరావులు 17 మంది సినీ ప్రముఖులకు సన్మానం చేశారు. పరాయి గడ్డపై తెలుగు సినిమాని విమర్శించిన డీకే అరుణ తెలుగు సినిమా పరిశ్రమ సాంకేతికంగా ముందడుగు వేసినా సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంలో పూర్తిగా దారి తప్పిందని సినిమాటోగ్రఫీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. మూకీ నుండి అంచలంచెలుగా సినిమా ఎదిగిందని అన్నారు. తొలినాళ్లలో అనేక మంచి చిత్రాలు రాగా... రాను రాను తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు తిలోదకాలివ్వడం, నటీమణుల వస్త్రధారణ జుగుప్సాకరంగా మారడం ఇత్యాది కారణాల వల్ల కుటుంబ సమేతంగా చిత్రాలు చూడలేని పరిస్థితి నెలకొందన్నారు. తెలుగు సినిమా సంఖ్యాపరంగా ఎంత ముందున్నా.. జాతీయ, అంతర్జాతీయ అవార్డుల పరిధిలోకి చేరకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఇకనైనా సినీ సంఘం పెద్దలు తమ ధోరణిని మార్చుకుని ఉత్తమ విలువలు కలిగిన సినిమాలు నిర్మించాలని ఆమె కోరారు. తప్పులు సహజం: సి. కల్యాణ్ వందేళ్ల సినీ వేడుకల వంటి అతి పెద్ద కార్యక్రమాల్లో చిన్న చిన్న తప్పులు దొర్లడం సహజమని దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ సమర్థించుకున్నారు. సినీ సైలడ్ల ప్రదర్శనలో అనేక తప్పులు దొర్లగా త్రిపురనేని మహారథి ఫొటో మిస్ అయ్యిందని ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. వందేళ్ల వేడుకల విషయంలో కొందరు వివాదాలు సృష్టించారని, మనం ఏసీ రూములో పడుకున్నా కూడా కొన్ని చీడపురుగులు, దోమలు వస్తుంటాయని, వాటిని మనం నలిపేస్తుంటామని పేర్కొన్నారు. దోమలు మనల్ని ఏమీ చేయలేవని, ఇలాంటి వేడుకలో పాలుపంచుకోకపోవడం వారి దౌర్భాగ్యమని ఘాటుగా స్పందించారు. ఆర్. నారాయణమూర్తి ఆగ్రహం సినీ వేడుకలలో భాగంగా సాంసృ్కతిక కార్యక్రమాలు గంటల తరబడి జరుగుతున్న సందర్భంలో ఆర్. నారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేదిక మీదకు వెళ్లారు. మైకు తీసుకుని వందేళ్ల వేడుకలు ఒక ఆడియో ఫంక్షన్‌లా తయారయ్యాయని విమర్శిస్తూ ఇంకా ఏదో ప్రసంగించబోతుండగా సి. కల్యాణ్ ప్రోద్భలంతో కొందరు వ్యక్తులు వచ్చి ఆయన చేతిలోని మైకును బలవంతంగా లాక్కుని తోసుకుంటూ కిందకి నెట్టివేశారు. కొద్ది సేపటి తరువాత మళ్లీ నారాయణమూర్తి స్టేజి మీదకు వెళ్లడానికి ప్రయత్నించడం, ఆయన్ని అడ్డుకోవడంతో సభా వేదిక ముందు నిలుచుకుని బిగ్గరగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అపశ్రుతులు తెరపై ప్రదర్శించిన స్లైడుల ప్రదర్శనలో దాదా సాహెబ్ ఫాల్కే అనే పేరును కింద రాసి ఫొటో మాత్రం ఆర్జీ టోర్నీ అనే మరో సినీ ప్రముఖుడి ఫొటో వేశారు. తొలి టాకీ ‘భక్త ప్రహ్లాద’ 1932 ఫిబ్రవరి 6వ తేది విడుదల కాగా, 1931లో విడుదలైనట్లు పేర్కొన్నారు. హెచ్ఎం రెడ్డి బదులు కేవీ రెడ్డి ఫొటో వేశారు. విజయశాంతి పాటను ప్రదర్శిస్తూ రోజా క్లిప్పింగ్నూ, మీనా పాటకు విజయశాంతి క్లిప్పింగ్‌ను చూపారు. తెలుగు సినీ వెలుగులను ప్రజ్వలింప చేసిన మహామహులను స్మరించుకోకుండానే కార్యక్రమాలను నిర్వహించారు. - నందగోపాల్, చెన్నై ప్రతినిధి