వందేళ్ల సినిమా వేడుకలో రెండో రోజు
వందేళ్ల సినిమా వేడుకలో రెండో రోజు
Published Mon, Sep 23 2013 1:40 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM
చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఆదివారం సాయంత్రం ప్రారంభమైన శత వసంతాల భారతీయ సినిమా వేడుకల్లో రెండో రోజు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, కేంద్రమంత్రి చిరంజీవి హాజరు కాలేదు. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డీకే అరుణ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. తెలుగు సినీ దిగ్గజాలైన అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణ రావు, కృష్ణ సైతం హాజరు కాలేదు. డా. డి.రామానాయుడు, కృష్ణంరాజు, బాలకృష్ణ, వెంకటేశ్, రాజేంద్రప్రసాద్, రాజశేఖర్ , సురేష్‌బాబు, అల్లు అరవింద్, మురళీమోహన్, కోట శ్రీనివాసరావు, బాబుమోహన్, శ్రీకాంత్, మనోజ్, రానా, ఆది, కృష్ణకుమారి, వాణిశ్రీ, జయసుధ, జయప్రధ, రాధ, చార్మి, మంచు లక్ష్మీ ప్రసన్న తదితరులు హాజరయ్యారు. సమాచార మంత్రి డీకే అరుణ, మంత్రి గంటా శ్రీనివాసరావులు 17 మంది సినీ ప్రముఖులకు సన్మానం చేశారు.
పరాయి గడ్డపై తెలుగు సినిమాని విమర్శించిన డీకే అరుణ
తెలుగు సినిమా పరిశ్రమ సాంకేతికంగా ముందడుగు వేసినా సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంలో పూర్తిగా దారి తప్పిందని సినిమాటోగ్రఫీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. మూకీ నుండి అంచలంచెలుగా సినిమా ఎదిగిందని అన్నారు. తొలినాళ్లలో అనేక మంచి చిత్రాలు రాగా... రాను రాను తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు తిలోదకాలివ్వడం, నటీమణుల వస్త్రధారణ జుగుప్సాకరంగా మారడం ఇత్యాది కారణాల వల్ల కుటుంబ సమేతంగా చిత్రాలు చూడలేని పరిస్థితి నెలకొందన్నారు. తెలుగు సినిమా సంఖ్యాపరంగా ఎంత ముందున్నా.. జాతీయ, అంతర్జాతీయ అవార్డుల పరిధిలోకి చేరకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఇకనైనా సినీ సంఘం పెద్దలు తమ ధోరణిని మార్చుకుని ఉత్తమ విలువలు కలిగిన సినిమాలు నిర్మించాలని ఆమె కోరారు.
తప్పులు సహజం: సి. కల్యాణ్
వందేళ్ల సినీ వేడుకల వంటి అతి పెద్ద కార్యక్రమాల్లో చిన్న చిన్న తప్పులు దొర్లడం సహజమని దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ సమర్థించుకున్నారు. సినీ సైలడ్ల ప్రదర్శనలో అనేక తప్పులు దొర్లగా త్రిపురనేని మహారథి ఫొటో మిస్ అయ్యిందని ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. వందేళ్ల వేడుకల విషయంలో కొందరు వివాదాలు సృష్టించారని, మనం ఏసీ రూములో పడుకున్నా కూడా కొన్ని చీడపురుగులు, దోమలు వస్తుంటాయని, వాటిని మనం నలిపేస్తుంటామని పేర్కొన్నారు. దోమలు మనల్ని ఏమీ చేయలేవని, ఇలాంటి వేడుకలో పాలుపంచుకోకపోవడం వారి దౌర్భాగ్యమని ఘాటుగా స్పందించారు.
ఆర్. నారాయణమూర్తి ఆగ్రహం
సినీ వేడుకలలో భాగంగా సాంసృ్కతిక కార్యక్రమాలు గంటల తరబడి జరుగుతున్న సందర్భంలో ఆర్. నారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేదిక మీదకు వెళ్లారు. మైకు తీసుకుని వందేళ్ల వేడుకలు ఒక ఆడియో ఫంక్షన్‌లా తయారయ్యాయని విమర్శిస్తూ ఇంకా ఏదో ప్రసంగించబోతుండగా సి. కల్యాణ్ ప్రోద్భలంతో కొందరు వ్యక్తులు వచ్చి ఆయన చేతిలోని మైకును బలవంతంగా లాక్కుని తోసుకుంటూ కిందకి నెట్టివేశారు. కొద్ది సేపటి తరువాత మళ్లీ నారాయణమూర్తి స్టేజి మీదకు వెళ్లడానికి ప్రయత్నించడం, ఆయన్ని అడ్డుకోవడంతో సభా వేదిక ముందు నిలుచుకుని బిగ్గరగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
అపశ్రుతులు
తెరపై ప్రదర్శించిన స్లైడుల ప్రదర్శనలో దాదా సాహెబ్ ఫాల్కే అనే పేరును కింద రాసి ఫొటో మాత్రం ఆర్‌జీ టోర్నీ అనే మరో సినీ ప్రముఖుడి ఫొటో వేశారు.
తొలి టాకీ ‘భక్త ప్రహ్లాద’ 1932 ఫిబ్రవరి 6వ తేది విడుదల కాగా, 1931లో విడుదలైనట్లు పేర్కొన్నారు.
హెచ్‌ఎం రెడ్డి బదులు కేవీ రెడ్డి ఫొటో వేశారు.
విజయశాంతి పాటను ప్రదర్శిస్తూ రోజా క్లిప్పింగ్‌నూ, మీనా పాటకు విజయశాంతి క్లిప్పింగ్‌ను చూపారు.
తెలుగు సినీ వెలుగులను ప్రజ్వలింప చేసిన మహామహులను స్మరించుకోకుండానే కార్యక్రమాలను నిర్వహించారు.
- నందగోపాల్, చెన్నై ప్రతినిధి
Advertisement
Advertisement