భారత్‌కు భంగపాటు
భారత్ ముందు 300కు పైగా పరుగుల విజయలక్ష్యం. గత కొన్నాళ్లుగా వన్డేల్లో, అదీ సొంతగడ్డపై మన జట్టు ఆటను బట్టి చూస్తే ఇది అసలు లెక్కలోకే రాదు. దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్‌తో ఇంతకంటే ఎంతో పెద్ద స్కోర్లను మనోళ్లు అలవోకగా ఛేదించి పడేశారు. ఈసారి ప్రత్యర్థి చూస్తే బలహీన జట్టు. వార్మప్‌లలో కుర్రాళ్ల చేతిలోనూ కుదేలైంది. ఇంకేముంది... ధోని సేన గెలుపు లాంఛనమే అనిపించింది. అయితే అన్ని అంచనాలను వెస్టిండీస్ తలకిందులు చేసింది. స్ఫూర్తిదాయక ఆటతీరుతో ధోని సేనను చిత్తు చేసింది.
కొచ్చి: తొలి వన్డే ప్రారంభమయ్యే వరకు కూడా వెస్టిండీస్ ఆడుతుందో, లేదో అని సందేహం... కానీ కష్టాలు, ఆలోచనలు అన్నీ పక్కనపెట్టి బరిలోకి దిగిన కరీబియన్లు... ఆటతోనే తమ బోర్డుకు సమాధానం చెప్పారు. బుధవారం ఇక్కడి నెహ్రూ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 124 పరుగుల తేడాతో భారత్‌నుచిత్తుగా ఓడించి ధోని సేనకు సిరీస్‌లో పెను సవాల్ విసిరారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది.
‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మార్లోన్ శామ్యూల్స్ (116 బంతుల్లో 126 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగగా, కీపర్ రామ్‌దిన్ (59 బంతుల్లో 61; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అతనికి సహకరించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 23.1 ఓవర్లలో 165 పరుగులు జోడించారు. అనంతరం భారత్ 41 ఓవర్లలో 197 పరుగులకే ఆలౌటైంది. శిఖర్ ధావన్ (92 బంతుల్లో 68; 9 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విండీస్ చేతిలో భారత్‌కు ఇది రెండో అతి పెద్ద పరాజయం. 2002లో 135 పరుగుల తేడాతో (విజయవాడలో) ఓడినప్పుడు కూడా శామ్యూల్స్ సెంచరీ చేశాడు. తాజా ఫలితంతో ఐదు వన్డేల సిరీస్‌లో విండీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే శనివారం న్యూఢిల్లీలో జరుగుతుంది.
భారీ భాగస్వామ్యం...
ఎప్పటిలాగే భువనేశ్వర్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆరంభంలో వెస్టిండీస్‌ను కట్టడి చేశాడు. అయితే డ్వేన్ స్మిత్ (45 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజ్‌లో నిలదొక్కుకొని, కెప్టెన్ డ్వేన్ బ్రేవో (17), డారెన్ బ్రేవో (28)లతో కలిసి కీలక పరుగులు జోడించాడు. విండీస్ తొలి పవర్ ప్లేలో విండీస్ 52 పరుగులు చేసింది. 11వ ఓవర్లో స్మిత్‌ను అవుట్ చేసి జడేజా బ్రేక్ అందించాడు. అనంతరం శామ్యూల్స్, రామ్‌దిన్ జత కలిశారు.
వీరిద్దరు చక్కటి సమన్వయంతో ఆడుతూ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. శామ్యూల్స్ 58 బంతుల్లో, రామ్‌దిన్ 52 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరి జోరు మరింత పెరిగింది. శామ్యూల్స్ 99 బంతుల్లోనే కెరీర్‌లో ఆరో సెంచరీని పూర్తి చేసుకున్న శామ్యూల్స్ ఈ మ్యాచ్‌లో 4 వేల పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. భారత్ తరఫున ముగ్గురు స్పిన్నర్లు కలిపి 22 ఓవర్లలో 144 పరుగులు సమర్పించుకున్నారు.
ధావన్ ఒక్కడే...
భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ధావన్, రహానే (24) కలిసి చెప్పుకోదగ్గ ఆరంభాన్ని అందించారు. అయితే రెండో పరుగు కోసం ప్రయత్నించే క్రమంలో సమన్వయ లోపంతో రహానే రనౌట్ కావడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. కోహ్లి (2) చెత్త ఫామ్ భారత్‌లోనూ కొనసాగింది. టేలర్ బౌలింగ్‌లో స్లిప్స్‌లోనే క్యాచ్ ఇచ్చి అతను వెనుదిరిగాడు.
భారత్‌లో తొలి వన్డే ఆడుతున్న రాయుడు (13)కు బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ లభించినా, పేలవ షాట్‌తో దానిని ఉపయోగించుకోలేకపోగా... బ్రేవో అద్భుత బంతికి రైనా (0), స్యామీ బౌలింగ్‌కు ధోని (8) క్లీన్‌బౌల్డయ్యారు. మరోవైపు ఒంటరి పోరాటం చేసిన ధావన్ 71 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అతను అవుట్ కావడంతో భారత్ మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకుంది. చివర్లో జడేజా (36 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించినా లక్ష్యానికి చాలా దూరంలో భారత్ నిలిచిపోయింది.
స్కోరు వివరాలు
వెస్టిండీస్ ఇన్నింగ్స్: స్మిత్ (బి) జడేజా 46; డ్వేన్ బ్రేవో (సి) ధావన్ (బి) షమీ 17; డారెన్ బ్రేవో (సి) ధావన్ (బి) మిశ్రా 28; శామ్యూల్స్ (నాటౌట్) 126; రామ్‌దిన్ (సి) జడేజా (బి) షమీ 61; పొలార్డ్ (బి) షమీ 2; రసెల్ (సి) కోహ్లి (బి) షమీ 1; స్యామీ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 30; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 321
వికెట్ల పతనం: 1-34; 2-98; 3-120; 4-285; 5-296; 6-298.
బౌలింగ్: భువనేశ్వర్ 10-1-38-0; మోహిత్ 9-0-61-0; షమీ 9-1-66-4; జడేజా 10-0-58-1; మిశ్రా 10-0-72-1; రైనా 2-0-14-0.
భారత్ ఇన్నింగ్స్: రహానే (రనౌట్) 24; ధావన్ (బి) శామ్యూల్స్ 68; కోహ్లి (సి) స్యామీ (బి) టేలర్ 2; రాయుడు (సి) బెన్ (బి) రసెల్ 13; రైనా (బి) డ్వేన్ బ్రేవో 0; ధోని (బి) స్యామీ 8; జడేజా (నాటౌట్) 33; భువనేశ్వర్ (సి) స్యామీ (బి) శామ్యూల్స్ 2; మిశ్రా (ఎల్బీ) (బి) డ్వేన్ బ్రేవో 5; మోహిత్ (సి) టేలర్ (బి) రామ్‌పాల్ 8; షమీ (బి) రామ్‌పాల్ 19; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (41 ఓవర్లలో ఆలౌట్) 197
వికెట్ల పతనం: 1-49; 2-55; 3-82; 4-83; 5-114; 6-134; 7-138; 8-146; 9-155; 10-197.
బౌలింగ్: రామ్‌పాల్ 8-0-48-2; టేలర్ 10-1-50-1; డ్వేన్ బ్రేవో 6-0-28-2; రసెల్ 4-0-21-1; బెన్ 5-0-16-0; స్యామీ 5-0-23-1; శామ్యూల్స్ 3-0-10-2.