సమ్మె బాట!
Published Wed, Jan 1 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM
సాక్షి, చెన్నై : రాష్ట్రంలోని తిరుచ్చి నుంచి దక్షిణాదిలోని పలు జిల్లాలకు ఇండియన్ ఆయిల్ గ్యాస్ సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. ఇక్కడ ఏ ఆందోళన మొదలైనా ఇతర రీజియన్లకు పాకుతుంది. దీపావళి సందర్భంగా ఇవ్వాల్సిన బోనస్ కోసం ఇక్కడి లారీ డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. అధికారులు దిగిరాక తప్పలేదు. అయితే, బోనస్ నినాదంతో ఆందోళనకు ఉసిగొల్పిన పలువురు డ్రైవర్లపై వేటు వేశారు. వీరిని మళ్లీ విధుల్లోకి చేర్చుకోవాలంటూ డ్రైవర్లు ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. వీరికి మద్దతుగా ఇతర రీజియన్లలోని డ్రైవర్లు గళం విప్పుతున్నారు. ఈ ఆందోళనలతో తరచూ గ్యాస్ సరఫరాకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో గత వారం ఐవోసీ ఉన్నతాధికారి శివరాజన్ నేతృత్వంలో చర్చలకు నిర్ణయించారు. అయితే, తిరుచ్చి కేంద్రానికి చెందిన ఐవోసీ అధికారులు గానీ, లారీ యజమానులు గానీ రాలేదు.
కాంట్రాక్టు కింద పనిచేస్తున్న డ్రైవర్లు మాత్రం వచ్చి నిరాశతో వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో సోమవారం ముత్తు స్వామి, కుమరేషన్, పాండియన్, సుబ్రమణ్యం తదితర నలుగురు డ్రైవర్లను ఉన్నట్టుండి తొలగించారు. దీంతో డ్రైవర్లలో ఆగ్రహం రేగింది. ఒకరి తర్వాత మరొకర్ని తొలగిస్తూ వెళుతుండటాన్ని తీవ్రంగా పరిగణించారు. సమ్మె బాట పట్టారు. ఎక్కడి లారీలను అక్కడే నిలిపి వేశారు. దీంతో ఈ కేంద్రం నుంచి పలు జిల్లాలకు వెళ్లాల్సిన యాభై వేల సిలిండర్ల సరఫరా ఆగింది. తమ వాళ్లను విధుల్లోకి తీసుకునే వరకు ఈ సమ్మె కొనసాగుతుందని డ్రైవర్లు ప్రకటించడంతో గ్యాస్ కొరత ఏర్పడే ప్రమాదం నెలకొంది. పండుగ సమీపిస్తున్న సమయంలో దక్షిణాదిలో బయలు దేరిన ఈ డ్రైవర్ల సమ్మె బాట ఉత్తరాది జిల్లాలకు పాకిన పక్షంలో గ్యాస్ కొరతను వినియోగదారులు ఎదుర్కోవాల్సిందే.
Advertisement
Advertisement