ప్రేమోన్మాదికి యూవజ్జీవం
Published Wed, Aug 21 2013 3:23 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి: పాండిచ్చేరి సమీపం కారైక్కాల్ జిల్లా ఎంఎంజీనగర్‌కు చెందిన జయపాల్ ఒక ప్రయివేటు పాఠశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. ఆయన కుమార్తె వినోదిని (23) ఇంజినీరింగ్ పూర్తి చేసింది. చెన్నై సైదాపేటలోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించింది. జయపాల్ కుటుంబానికి వారి సమీప బంధువు సురేష్‌కుమార్ ఆర్థికంగా చేదోడువాదోడుగా నిలిచేవాడు. అదే సమయంలో వినోదినిపై ప్రేమ పెంచుకున్నాడు. ఈ ప్రేమ ప్రతిపాదనను వినోదిని తిరస్కరించింది. దీంతో ఆమెపై సురేష్‌కుమార్ కక్ష పెంచుకున్నాడు. గత ఏడాది నవంబరులో దీపావళి పండుగ నిమిత్తం వినోదిని కారైక్కాల్‌లోని తన తండ్రి వద్దకు వచ్చింది. పండుగ ముగిసిన తర్వాత చెన్నై వెళ్లేందుకు నవంబరు 14వ తేదీ రాత్రి ఇంటి నుంచి బయలుదేరింది. ఆమె వెంట తండ్రి జయపాల్, కుటుంబ మిత్రుడు పద్మనాభన్ ఉన్నారు. అకస్మాత్తుగా వారి ముందుకు వచ్చిన సురేష్‌కుమార్ వినోదిని ముఖంపై యాసిడ్ పోశాడు. తీవ్రగాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించారు. మూడు నెలలు మృత్యువుతో పోరాడిన వినోదిని ఈ ఏడాది ఫిబ్రవరి 12న కన్నుమూసింది. సంఘటన జరిగిన వెంటనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తీర్పు వెల్లడి: ఈ కేసును కారైక్కాల్ సెషన్స్ కోర్టు విచారించింది. దాడి సమయంలో ప్రత్యక్ష సాక్షులను, యాసిడ్ అమ్మకందారులను, వినోదినికి చికిత్స చేసిన వైద్యులు ఇలా మొత్తం 24 మందిని కోర్టు విచారించింది. కేసు విచారణ మంగళవారం పూర్తరుుంది. ‘నీపై మోపిన అభియోగాలు రుజువయ్యూరుు, శిక్ష విధించబోతున్నాం, ఏమైనా చెప్పుకోవాల్సి ఉందా’ అంటూ నిందితుని న్యాయమూర్తి వైద్యనాథన్ ప్రశ్నించారు. అన్నీ హైకోర్టులో చెబుతానంటూ సురేష్ సమాధానమిచ్చాడు. దీంతో సురేష్‌కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించలేని పక్షంలో మరో మూడేళ్లు జైలు జీవితం గడపాలని ఆదేశించారు.
తగిన శిక్ష పడింది: జయపాల్, వినోదిని తండ్రి
నా కుమార్తెను పాశవికంగా హతమార్చిన సురేష్‌కుమార్‌కు తగిన శిక్షే పడింది. యాసిడ్ దాడులకు పాల్పడేవారికి ఈ తీర్పు ఒక గుణపాఠం కావాలి. వినోదిని మృతితో తమిళనాట యాసిడ్ అమ్మకాలను నియంత్రించారు. ఈ రకంగానూ నా కుమార్తె ఆత్మ శాంతిస్తుంది. కేసును సత్వరం పరిష్కరించిన వారికి కృతజ్ఞతలు.
Advertisement
Advertisement