రాజకీయ లబ్ధి కోసం ఇటీవల శివసేన, బీజేపీ కూటమిగా ఏర్పడినప్పటికీ వచ్చే ..
సాక్షి, ముంబై: రాజకీయ లబ్ధి కోసం ఇటీవల శివసేన, బీజేపీ కూటమిగా ఏర్పడినప్పటికీ వచ్చే మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయడమే ఉత్తమమని ఇరు పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఎవరి ప్రాబల్యం ఎంతుందో ఇటీవల జరిగిన శాసన ఎన్నికలతో తేటతెల్లమైనప్పటికీ శివసేన కార్యకర్తలు 2017లో జరిగే బీఎంసీ ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. అయితే శివసేన కంటే బీజేపీ ఒక అడుగు ముందుకు వేసింది.
వచ్చే ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న వివిధ పార్టీలకు చెందిన 70-80 మంది సిట్టింగ్, మాజీ కార్పొరేటర్ల జాబితా ఇప్పుడే రూపొందించి సిద్ధం చేసుకుంది. విజయావకాశాలు ఎక్కువ ఉన్న వార్డులపై ఇప్పటి నుంచే ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇదిలా ఉండగా అన్ని ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలిసే పోటీచేస్తాయని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కాని ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో పాతికేళ్ల బంధాన్ని తెంచుకుని ఇరు పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగాయి. తెగిపోయిన బంధం పూర్వం లాగా అతుక్కోవాలంటే వెంటనే సాధ్యమయ్యే పని కాదని కార్యకర్తలు అంటున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వంలో ఇరు పార్టీలు కలిసి కొనసాగుతున్నప్పటికీ శాసన సభ ఎన్నికల్లో ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఇలాంటి సందర్భంలో బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ నాయకులతో కలిసి ప్రచారం చేయడం సాధ్యం కాదేమోనని కొందరు శివసేన నాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఒంటరిగా బరిలో దిగడమే ఉత్తమమని అనుకుంటున్నారు. ఒకవేళ అవసరమైతే ఇప్పుడెలా ఇరు పార్టీలు ఒక్కటయ్యాయో ఇదే తరహాలో బీఎంసీ ఎన్నికల తర్వాత కూడా పొత్తు కుదుర్చుకోవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం బీఎంసీలో శివసేన, బీజేపీ, ఆర్పీఐ మహాకూటమి అధికారంలో ఉంది. గత బీఎంసీ ఎన్నికల్లో మొత్తం 227 వార్డులుండగా 139 వార్డుల్లో శివసేన, 63 వార్డుల్లో బీజేపీ, 25 వార్డుల్లో ఆర్పీఐ పోటీ చేశాయి. ఈసారి మాత్రం పరిస్థితులు మరో విధంగా ఉన్నాయి. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో ముంబైలో శివసేన కంటే బీజేపీ ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకుంది. శివసేన 14 సీట్లు రాగా, బీజేపీ 15 స్థానాలు గెలుచుకుంది. దీన్ని బట్టి వచ్చే బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా ఎక్కువ స్థానాలు డిమాండ్ చేయడం ఖాయమని తేలిపోయింది.
దీంతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఫార్ములాలకు బీజేపీ ఇప్పుడు ఒప్పుకోదు. అదేవిధంగా శివసేన కూడా 50ః50 ఫార్ములాలకూ అంగీకరించదు. దీంతో ఇరు పార్టీల మధ్య పేచీ మళ్లీ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగానే పోటీచేయడం ఉత్తమమని ఇరు పార్టీల కార్యకర్తలు తమ తమ అభిప్రాయాలను అధిష్టానానికి వెల్లడిస్తున్నారు.