హిందీ చిత్రాలను జాతీయ సినిమాలుగా, మిగతా వాటిని ప్రాంతీయ చిత్రాలుగా పిలిచే సంస్కృతి మంచిది కాదని జాతీయ అవార్డు గ్రహీత గౌతమ్ ఘోష్ అన్నారు. అన్ని సినిమాలనూ భారతీయ చిత్రాలని మాత్రమే పిలవాలని కోరారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దూరదర్శన్ సంయుక్తంగా ఈ నెల ఆరు నుంచి ఢిల్లీలో నిర్వహిస్తున్న బెంగాల్ చిత్రోత్సవంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ ఘోష్ పైవిధంగా అన్నారు. అంతర్జాతీయస్థాయి అవార్డులు, ప్రశంసలు సాధించిన సినిమాలను ఈ ఉత్సవంలో ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఘోష్ మాట్లాడుతూ ‘సినిమాకు దర్శకుడు అత్యంత కీలకం.
నిజానికి సినిమాలో అతణ్నే ముఖ్యపాత్రగా భావించాలి. సినిమా జయాపజయాలకు అతడిదే పూర్తి బాధ్యత. నటులు, సిబ్బందిని నియంత్రించాల్సిన బాధ్యత కూడా దర్శకుడిపైనే ఉంటుంది. మనదేశంలో అన్ని సినిమాలనూ భారతీయ చిత్రాలని మాత్రమే పిలవాలి’ అని వివరించారు. ఘోష్ గురించి మరో ఆసక్తికర విషయమేమంటే ఆయన ప్రఖ్యాత దర్శకుడే కాదు.. సంగీత దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కూడా. ప్రతి దర్శకుడు నటీనటుల మనోభావాలను గుర్తెరిగి వారితో పనిచేయించుకోవాలని సూచించాడు. ఎంత పెద్ద నటులైనా, నటన రానివాళ్లకైనా ఈ సూత్రం వర్తిస్తుందని స్పష్టం చేశాడు.
‘సినిమా, అనువర్తిత కళలు-పరస్పరాశ్రయం’ పేరుతో నిర్వహించిన చర్చలో మాట్లాడిన ఈ బెంగాలీ దర్శకుడు పైవిషయాలు తెలిపారు. ప్రముఖ దర్శకుడు అశోక్ విశ్వనాథన్, సినీ విమర్శకుడు మనోజిత్ లాహిరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమకాలీన సినీపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి విశ్వనాథన్ మాట్లాడుతూ సినిమా కళ అంతర్భాగమేనని గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఘోష్ 2005లో తీసిన నిశబ్ద్ సినిమాను కూడా ఈ ఉత్సవంలో ప్రదర్శించారు.
ఆ నిర్వచనమే తప్పు
Published Sun, Sep 7 2014 10:58 PM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM
Advertisement
Advertisement