ఉగ్రవాదిగా మరణించిన తమ కుటుంబసభ్యుని శవాన్ని తీసుకోవడానికి అత్యంత దేశభక్తిగల కొన్ని ముస్లిం కుటుంబాలు నిరాకరిస్తున్న కారణంగానే దేశం ఇంకా మంటల్లో చిక్కుకోలేదా? అంటే ఇదొక్కటే కారణం కాదని తాజా హిందీ సినిమా ‘ముల్క్’ చెబుతోంది. ఈ సినిమాలో నాకు నచ్చిన అత్యంత సాహసవంతమైన అంశం ఏమంటే– ముస్లింలలో అత్యుత్తమ గుణాలున్నవారిని మాత్రమే చూపించడాన్ని ప్రశ్నించడం. ఇక్కడే దర్శకుడు అనుభవ్ సిన్హా ప్రత్యేకత కనిపిస్తుంది. ఇక్కడ చెప్పిన దేశభక్తులు మాత్రమే గొప్పవాళ్లు కాదనీ, అత్యధిక ముస్లింలు కూడా వారిలాంటి బుద్ధిమంతులని ఆయన ముల్క్ ద్వారా చెప్పారు.
ప్రతి ఏడుగురు భారతీయుల్లో ఒకరు ముస్లిం. ఈ లెక్కన 2021 జనాభా లెక్కల్లో వారి సంఖ్య 20 కోట్లు దాటిపోతుంది. భారతదేశపు అత్యంత విజయవంతమైన సృజనాత్మక పరిశ్రమ సినిమారంగంలో ముస్లింల శాతం జనాభాలో వారి నిష్పత్తి కన్నా ఎక్కువే. మన చిత్ర పరిశ్రమలో ప్రతి ఏడుగురు ఉత్తమ నటులు, సంగీత దర్శకులు, పాటల రచయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్లో ముస్లింలు ఒకరి కంటే ఎక్కువ మందే ఉన్నారు. భారత సినిమా పరిశ్రమలో ముఖ్యంగా హిందీ సినిమాల్లో ముస్లింల కథాంశంతో నిర్మించే చిత్రాలు బాగా తక్కువ. చాలా అరుదుగా ముస్లింలు ప్రధాన పాత్రధారులుగా తీసే సినిమాల్లో వారిని చాలా మంచి మనుషులుగా లేదా నిజంగా చెడ్డవారిగా చూపిస్తారు. అందుకే అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన తాజా హిందీ చిత్రం ‘ముల్క్’ పైన చెప్పిన ముస్లిం సినిమాలకు భిన్నంగా ఉంది.
హిందీ సినిమాల్లో ముస్లిం పాత్రలు
హిందీ సినిమాల్లో ముస్లింలను చిత్రించిన తీరును బట్టి ఈ తరహా చిత్రాలను మూడు దశల్లో వచ్చినవిగా అంచనా వేయవచ్చు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 1960ల వరకూ మొఘల్ చరిత్రకు సంబంధించిన ప్రముఖుల కథల ఆధారంగా వరకూ తీసిన సినిమాలే ఎక్కువ. తాజ్‌మహల్, ముఘలే ఆజం, రజియా సుల్తానా వంటివి ఈ తరహా సినిమాలు. అదే కాలంలో మేరే మెహబూబ్ నుంచి పాకీజా వరకూ నిర్మించిన ‘ముస్లిం సాంఘిక’ సినిమాల్లో ప్రేమ, కవిత్వం, భూస్వామ్యవర్గం ఆడంబరాలు వంటి అంశాలతో నిండి ఉన్నాయి. 1970ల్లో ముస్లింలను ‘ఆగ్రహంతో ఉన్న యువకుల’ లక్షణాలతో చూపిస్తూ హిందీ సినిమాలు వచ్చాయి. ఈ రకం సినిమాల్లో విశాల హృదయంతో, నిజాయితీతో ధైర్యసాహసాలు ప్రదర్శించే ముస్లిం పాత్రధారులు చివర్లో దేశం కోసం, తమ హిందూ స్నేహితుల కోసం ప్రాణాలు అర్పించడం చూశాం. 1973లో ప్రకాశ్‌మెహ్రా తీసిన ‘జంజీర్’ షేర్‌ఖాన్ పాత్రలో ప్రాణ్ ఇందులో తన మిత్రుడు, హీరో అమితాబ్ బచ్చన్‌ను ఉద్దేశించి ‘యారీ హై ఈమాన్ మేరా, యార్ మేరా జిందగీ’ అంటూ పాడిన పాట పై అంశానికి అద్దం పడుతోంది. 1980ల చివరి వరకూ వచ్చిన హిందీ చిత్రాల్లోని ముస్లింలు దాదాపుగా మంచివాళ్లుగానే ఉంటారు. అరుదుగా దుష్టపాత్రల్లో కనిపిస్తారు.
తర్వాతి దశలో తీరు మారింది. దీన్ని హిందీ సినిమాల్లో సన్నీ దేవల్ దశగా పిలుద్దాం. దేశంలో మతతత్వం పెరుగుతున్న ఈ కాలంలో ముస్లింలను చెడ్డవాళ్లుగా, ఎక్కువగా ఉగ్రవాదులుగా చిత్రిస్తూ సినిమాలు వచ్చాయి. అప్పటి సినిమాల్లో ఒకటైన ‘జాల్’(వల)లో హీరో సన్నీ దేవల్ మంచి మనిషిగా దుష్టులకు(వారంతా ముస్లింలే) గుణపాఠం చెబుతాడు. ఆ సమయంలో వెనుక నుంచి ‘ఓం నమః శివాయ’ అనే మాటలు బిగ్గరగా వినిపిస్తారు. ముస్లింలు అంటే దుష్టులు వస్తున్నప్పుడు సమీపంలోని మసీదు నుంచి ముస్లింలకు నమాజు చేయాలని కోరే పిలుపు ‘అజా’ వస్తుంది. దేశభక్తి గల కథానాయకుని భార్య పాత్రలో టబూ నటించింది. ఆమె భర్తకు ద్రోహం చేసినట్టు ఈ సినిమాలో చూపించారు. దేవల్ హీరోగా చేసిన ఇలాంటిదే మరో చిత్రం ‘ద హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఏ స్పై’(గూఢచారి ప్రేమకథ అని అర్ధం). ఇందులో దేవల్ ముస్లిం భార్యగా ప్రియాంకా చోప్రా నటించింది. భర్త దుష్టులైన ముస్లింలతో పోరాడుతుంటే, ఆమె భర్త కోసం ప్రాణ త్యాగం చేస్తుంది. గదర్ ఏక్ ప్రేమ్ కథా అనే చిత్రం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇంత మతవిద్వేషంతో కూడిన హిందీ సినిమా ఏదీ అప్పటి వరకూ రాలేదని అప్పటి ఎడిటర్ ఎంజే అక్బర్ నాతో అన్నారు. అప్పటి నుంచి మళ్లీ ట్రెండ్ మారింది.
ముస్లింలను దుర్మార్గులుగా చిత్రించారు
ఇస్లాం అంటే భయపడే రోజుల్లో ముస్లింలను దుర్మార్గులుగా చిత్రించిన సినిమాలకు గిరాకీ పెరిగింది. కశ్మీర్‌లో ఉగ్రవాదం, అల్ కాయిదా, ఇండియన్ ముజాహదీన్ కార్యకలాపాలు ఎక్కువ కావడం దీనికి కార ణం. ముస్లిం పాత్రధారులు ఉన్న 50 సినిమాలపై అష్రఫ్ ఖాన్, సయీదా జరియా బుఖారీ 2011లో జరిపిన అధ్యయనం ఆసక్తికర అంశాలు వెల్లడించింది. ఈ సినిమాల్లో 65.2 శాతం ముస్లింలను చెడ్డ గుణాలున్న వారిగా, దాదాపు 30 శాతం చిత్రాల్లో తటస్థులుగా, కేవలం 4.4 శాతం సినిమాల్లో వారిని దుష్టులుగా చూపించారు. ఇటీవల కాలంలో పరిస్థితి మారింది. జాన్ అబ్రహం నటించిన న్యూయార్క్, షారుఖ్ ఖాన్ చిత్రం మై నేమ్ ఈజ్ ఖాన్, మలయాళ సినిమా అన్వర్‌లో ముస్లింలే కథానాయకులు.
ముల్క్‌లో గొప్ప మార్పు!
అనుభవ్ మిశ్రా సిన్హా దర్శకత్వం వహించిన ‘ముల్క్’ నిజంగా భిన్నమైన చిత్రం. హిందీ ప్రాంత నగరంలో(వారణాసి) నివసించే సాధారణ ముస్లిం కథే ఇందులో చూస్తాం. అయితే దీనిలో ప్రధాన పాత్రధారి(ముస్లిం) హిందూ కోడలు కుటుంబానికి కొంత దూరంగా ఉంటుంది. ముల్క్‌లో ముస్లింలను దేశభక్తిగల మంచి మనుషులుగానేగాక దుష్టులుగా, ఉగ్రవాదులుగా చూపించారు. ఇందులో మంచి ముస్లిం పోలీసు అధికారి పాత్రలో రజత్ కపూర్ చాలా తక్కువ మాటలతో, గొప్ప నటన ప్రదర్శించారు. వారణాసి ఉగ్రవాద వ్యతిరేక పోలీసు బృదం అధిపతిగా ఆయన తన సొంత మతానికి చెందిన వారిని గడగడలాడిస్తూ ప్రాణాలు తీయడంలో ఉత్సాహం చూపిస్తూ చేసిన నటన ఆకట్టుకుట్టుంది. రోజూవారీ సమస్యలున్న సగటు కుటుంబం కథ ఇది. ఇందులో ఎప్పటిలా కనిపించే మూస కోర్టు దృశ్యాలున్నాయి. ఈ కుటుంబ సభ్యుడైన కొడుకు ఉగ్రవాదిగా మారి పెట్టిన బాంబు పేలగా ముగ్గురు ముస్లింలు సహా 16 మంది మరణిస్తారు. తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో అతను మరణిస్తాడు. నేటి హిందీ ప్రాంత భారత ముస్లిం మనసులో కదలాడే భయం, అభద్రతాభావం, పరస్పర విరుద్ధమైన సంశయాలు, అనుమానాలు, ఆశలు, నిస్పృహలు–ఇవన్నీ సమ్మిళతమై వేధిస్తున్నట్టు ‘ముల్క్’లో కనిపించాయి. ఈ సినిమాలో లాయర్ మురాద్ అలీ మహ్మద్ (రిషికపూర్) సోదరుడి కొడుకు షాహిద్(ప్రతీక్ బబ్బర్) యువ ఉగ్రవాది. అతనిపై అనేక ఒత్తిళ్లతోపాటు ముస్లింలకు ఉద్యోగాలు ఇవ్వరని, ప్రపంచవ్యాప్తంగా వారిపై వివక్ష చూపిస్తున్నారనే ప్రచారం ప్రభావం చూపిస్తుంది.
నిజంగా ఏడుగురిలో ఒకరైన ముస్లిం మనసులో ఇలాంటి ఆలోచనలుంటే దేశం ఇంకా అల్లకల్లోలం కాలేదేమిటనే ప్రశ్న తలెత్తుతుంది. ఉగ్రవాదిగా మరణించిన తమ కుటుంబసభ్యుని శవాన్ని తీసుకోవడానికి అత్యంత దేశభక్తిగల కొన్ని ముస్లిం కుటుంబాలు నిరాకరిస్తున్న కారణంగానే దేశంలో ఇంకా మంటల్లో చిక్కుకోలేదా? అంటే ఇదొక్కటే కారణం కాదని ముల్క్ చెబుతోంది. ఈ సినిమాలో నాకు నచ్చిన అత్యంత సాహసవంతమైన అంశం ఏమంటే–ముస్లింలలో అత్యుత్తమ గుణాలున్నవారిని మాత్రమే చూపించడాన్ని ప్రశ్నించడం. మనం దేశం కోసం సరిహద్దుల్లో పోరాడి మరణించిన సైనికుడు హవల్దార్ అబ్దుల్ హమీద్, ఏపీజే అబ్దుల్ కలాం, షెహనాయి విధ్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్‌ను అభిమానిస్తాం. మిగిలిన ముస్లింలందరూ ఇలాగే ఉండాలని ఆశిస్తాం. ఇక్కడే దర్శకుడు అనుభవ్ సిన్హా ప్రత్యేకత కనిపిస్తుంది. ఇక్కడ చెప్పిన దేశభక్తులు మాత్రమే గొప్పవాళ్లు కాదనీ, అత్యధిక ముస్లింలు కూడా వారిలాంటి బుద్ధిమంతులని ఆయన ముల్క్ ద్వారా చెప్పారు. వాస్తవానికి ఉగ్రవాదులే ముస్లింలలో చాలా తక్కువ మంది ఉన్నారనేది ఆయన సందేశం.
ఇరవై ఏళ్లకు పైగా రాస్తున్న ఈ కాలమ్‌లో నేను రెండు సార్లు మాత్రమే హిందీ సినిమాల గురించి రాశాను. మన సమాజం లేదా రాజకీయాల్లో వచ్చిన కొత్త మార్పును (రాజకీయ పడితులు, నేతలు గుర్తించనివి) ప్రస్తావించిన సినిమాల గురించి చర్చించాను. సంపదను, ధనికుల జీవనశైలిని గొప్పగా చూపించిన ఫర్హాన్ అఖ్తర్ సినిమా దిల్ చాహ్తాహై(2001) గురించి మొదటిసారి రాశాను. రెండో సినిమా మసాన్. నీరజ్ ఘ్యావణ్ దర్శకత్వంలో 2015లో వచ్చిన ఈ చిత్రంలో అప్పటి అడ్డూ అదుపూ లేని అభివృద్ధి సమాజంలో, వ్యక్తులపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందో చెప్పడానికి మసాన్ ప్రయత్నించింది. ముల్క్ మాదిరిగానే మసాన్‌ను కూడా వారణాసి నేపథ్యంలోనే నిర్మించారు. ఆధునిక భారతంలో సాధారణ ముస్లిం కుటుంబం కథనే అనుభవ్ సిన్హా ఎంత భిన్నగా చూపించారంటే–ఈ సినిమా ప్రదర్శనను నిషేధించాలంటూ కొందరు డిమాండ్ చేసే పరిస్థితి తలెత్తింది. అయితే, గతంలో మేఘనా గుల్జార్ తీసిన ‘రాజీ’లో ఓ పాకిస్థానీ సైనికుడి కుటుంబంలోని సభ్యులు మంచివారిగా చిత్రించారు. ఇలాంటి సినిమాలు తీసే ధైర్యం, ఆత్మవిశ్వాసం భారతీయులకు ఉన్నందుకు మనం గర్వపడాలి. ఇప్పుడు ముల్క్ కూడా ‘రాజీ’లో మాదిరిగానే వాస్తవాలను ధైర్యంగా చెప్పింది.
2005లో ఇదే వారణాసి నగరంలోని గొప్ప ముస్లిం కళాకారుడు బిస్మిల్లా ఖాన్ నుంచి ఓ అద్భుతమైన పాఠం నేర్చుకున్నాను. నా ‘వాక్ ద టాక్’ ఇంటర్వ్యూ కోసం ఆయనను కలిసినప్పుడు, ‘‘జిన్నా స్వయంగా మిమ్మల్ని కోరినా మీరు 1947లో పాకిస్థాన్‌కు ఎందుకు వెళ్లిపోలేదు?’’ అని ప్రశ్నించాను. ‘‘ కైసే జాతే హమ్? వహా హమారా బనారస్ హై క్యా?’’(ఎందుకు వెళ్తాను? అక్కడేమైనా మా బెనారస్ ఉందా?) అని బిస్మిల్లాఖాన్ జవాబిచ్చారు. 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంచి సందేశమిస్తున్న ముల్క్ చూడాలనే నేను సలహా ఇస్తున్నాను.
శేఖర్ గుప్తా ,వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్
(twitter@shekargupta)
Comments
Please login to add a commentAdd a comment