
సోషల్ మీడియా ఎంత పని చేసింది!
చెన్నై: సోషల్ మీడియా ఎంత పని చేసిందని చెన్నై పోలీసులు వాపోతున్నారు. తాము చేసిన పని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడం పోలీసులకు తలనొప్పిగా మారింది. దీంతో సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నారు. జల్లికట్టు ఆందోళనల సందర్భంగా చెన్నైలో నిరసనకారులకు ఆటోలకు నిప్పు పెడుతూ పోలీసులు వీడియోకు చిక్కారు. కమల్ హాసన్, అరవింద్ స్వామి లాంటి సినీ ప్రముఖులతో పాటు చాలా మంది ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి పోలీసుల తీరును ఎండగట్టారు.
అడ్డంగా దొరికిపోవడంతో ఖాకీలు నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు పూర్తి చేయడానికి వారం రోజులు పడుతుందని ఉన్నత పోలీసు అధికారి వి. బాలకృష్ణన్ తెలిపారు. వీడియోలో యూనిఫాంలో ఉన్నది నిజమైన పోలీసులా, కాదా అనే దాని గురించి పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఈ వీడియో వెంటనే ఫేస్ బుక్, వాట్సాప్, ట్విటర్ లో ప్రత్యక్షం కావడం తమ శాఖ వైఫల్యంగానే భావిస్తున్నామన్నారు. ఈ వ్యవహరం తమకు పాఠం నేర్పిందని, ఇక నుంచి సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉంటామని వెల్లడించారు.
అయితే ఇది మార్ఫింగ్ చేసిన వీడియో అని అంతకుముందు పోలీసులు పేర్కొన్నారు. ఇది అసలైన వీడియోనా, కాదా అనేది దర్యాప్తులో వెల్లడవుతుందన్నారు. పోలీసు దుస్తుల్లో ఉన్న వ్యక్తులు నిరసనకారుల ఆటోలకు నిప్పు పెట్టినట్టు వీడియోలో కనబడడంతో కలకలం రేగింది.