కేజ్రీవాల్‌కు జమాతే ఇస్లామీ మద్దతు | Jamaat-e-Islami Hind supports Kejriwal in Varanasi | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌కు జమాతే ఇస్లామీ మద్దతు

Published Tue, May 6 2014 10:19 PM | Last Updated on Sat, Sep 2 2017 7:00 AM

Jamaat-e-Islami Hind supports Kejriwal in Varanasi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు జమాత్-ఎ-ఇస్లామీ హింద్ మద్దతు ప్రకటించింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కూడా ఇక్కడి నుంచే బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. కాగా వారణాసిలో ముస్లిం ఓటర్ల సంఖ్య కూడా గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉండడంతో బరిలో ఉన్న నేతలు వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ముస్లిం సంఘాల పెద్దలను కలిసి తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. దీంతో జమాత్-ఎ-ఇస్మామీ హింద్, ఉత్తరప్రదేశ్ విభాగం కేజ్రీవాల్‌కు మద్దతు ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అఖిల భారత ఇస్లాం సంస్థల అధ్యక్షుడు మౌలానా సయ్యద్ జలాలుద్దీన్ ఉమారి ఇప్పటికే కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
 
 కాశీలోనే బీజీపీ నేతల మకాం
 వారణాసి నుంచి బరిలోకి దిగిన తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ గెలుపు కోసం రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులంతా అక్కడే మకాం వేశారు. ఢిల్లీలో ఎన్నికలు ముగియడంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలు, కార్యకర్తలు ఇప్పుడు తమ దృష్టినంతా వారణాసిపైనే కేంద్రీకరించారు. వారణాసిలో ఆఖరి దశలో  పోలింగ్ జరగనుండడంతో నాయకులు, కార్యకర్తలు అక్కడ ప్రచారం చేస్తున్నారు. విజయ్‌గోయల్, విజేంద్ర గుప్తా, శోభా విజేంద్ర గుప్తా, రాజీవ్ బబ్బర్ , నళిన్ కోహ్లీ వంటి  నేతలు ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. మరికొంతమంది వారణాసికి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు.
 
 ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం పలువురు స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రచారం కోసం అమృత్‌సర్‌కు తరలివెళ్లారు. అక్కడ నుంచి బరిలోకి దిగిన అరుణ్‌జైట్లీ తరపున ప్రచారం చేశారు. అమృత్‌సర్‌లో కూడా పోలింగ్ ఏప్రిల్ 30న ముగియడంతో ఇప్పుడు అంతా  వారణాసిపైనే దృష్టి సారించారు. శోభా విజేంద్ర గుప్తా ఐటీ విభాగపు కార్యకలాపాలను పర్యవేక్షిస్తుండగా రాజీవ్ బబ్బర్ కార్యకర్తల సమీకరణలో నిమగ్నమయ్యారు. అరుణ్ జైట్లీతో పోలిస్తే మోడీ తరపున ప్రచారం చేయడం అత్యంత సులభమని వారంటున్నారు.  పంజాబ్‌లో అకాళీదళ్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత  తమకు ఇబ్బందికరంగా మారిందని, అయితే వారణాసిలో అటువంటి సమస్యలేవీ లేవంటున్నారు. కాగా వారణాసిలో ఈ నెల 12వ తేదీన పోలింగ్ జరగనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement