
హిల్లరీకి అమ్మ అభినందనలు
చెన్నై: అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల చరిత్రలో ప్రధాన రాజకీయ పార్టీ తరపున తొలి మహిళా అభ్యర్థిగా నామినేషన్ పొందిన హిల్లరీ క్లింటన్ను అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అభినందించారు. 2011లో అమెరికా విదేశాంగ మంత్రిగా హిల్లరీ భారత్ పర్యటకు వచ్చిన విషయాన్నిజయలలిత గుర్తుచేసుకున్నారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా హిల్లరీ నామినేషన్ పొందిన సంగతి తెలిసిందే.
'అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీ తరపున నామినేషన్ పొందిన తొలి మహిళా అభ్యర్థిగా చరిత్ర సృష్టించారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలందరూ గర్వపడాల్సిన, సంతోషించాల్సిన విషయమిది. అమెరికాలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలలో ఓ పార్టీ నుంచి మీరు అధ్యక్ష పదవికి అభ్యర్థిగా నామినేషన్ పొందడం అసాధారణ విషయం. ప్రపంచ వ్యాప్తంగా మహిళా సాధికారతకు పాటుపడతారని, గళం వినిస్తారని ఆశిస్తున్నా' అని జయ అభినందన సందేశంలో పేర్కొన్నారు.