జయ ఆస్తుల కేసు.. 27న తీర్పు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ముఖ్యమంత్రి జయలలిత జీవితంలో ఈనెల 27వ తేదీ కీలకం కానుంది. బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో నడుస్తున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తుదితీర్పు అదేరోజున వెలువడనుంది. ముఖ్యమంత్రి జయలలిత కొన్నేళ్లుగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఎదుర్కొంటున్నారు. కొంతకాలం ఈ కేసు విచారణ చెన్నైలోనే సాగింది. తమిళనాడులో విచారణ సాగితే జయలలిత ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేయగలరని పేర్కొంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను అనుసరించి జయ కేసు బెంగళూరుకు బదిలీ అయింది. బెంగళూరులోని ప్రత్యేక సివిల్ కోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. గత నెల 28వ తేదీతో విచారణ ముగియగా ఈనెల 20న తుదితీర్పు చెప్పనున్నట్లు న్యాయమూర్తి జాన్ మైఖేల్ డీ గుణ ప్రకటించారు. తుది తీర్పు సమయంలో నిందితులంతా తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలని తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
జయ న్యాయవాదులు ఈనెల 15వ తేదీన కొత్త పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన జయలలిత వాయిదాల సమయంలో ఇప్పటికే 2011 అక్టోబరు 20, 21 తేదీల్లోనూ, నవంబరు 21, 22 తేదీల్లోనూ నేరుగా హాజరయ్యూరని కోర్టుకు తెలిపారు. జెడ్ కేటగిరి భద్రతలో ఉన్న జయలలితకు కర్ణాటక ప్రభుత్వం తగిన బందోబస్తును కల్పించాలని సుప్రీం కోర్టు గతంలోనే ఆదేశించిందని వారు గుర్తుచేశారు. తగిన భద్రతా ఏర్పాట్లు చేసిన తరువాత తీర్పును వెల్లడించాలని కోరారు. బెంగళూరు పోలీస్ కమిషనర్ ఎమ్‌ఎన్ రెడ్డి కోర్టుకు ఒక ఉత్తరం సమర్పించారు.
జయ భద్రతా కారణాల దృష్ట్యా ప్రత్యేక కోర్టును పరప్పన అగ్రహార జైలు ప్రాంగణంలోకి మార్చిన తరువాత తీర్పు వెల్లడిస్తే మంచిందని కమిషనర్ సూచించారు. జయ న్యాయవాదుల పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. కోర్టును మరోచోటకు తరలించాలంటే కర్ణాటక హైకోర్టు అనుమతిని తీసుకోవాల్సి ఉంటుందని, ఇందుకు తగిన సమయం లేనందున తుదితీర్పును ఈనెల 20 వ తేదీ నుంచి 27 వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం జయకు జెడ్ కేటగిరి బందోబస్తును ఏర్పాటు చేయాలని కోరారు. జయ ఆస్తుల కేసుపై రాష్ట్రంలో పలు ఊహాగానాలు రేగుతుండగా, సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 27న ఎటువంటి తీర్పు వెలువడనుందోనని అన్నాడీఎంకే శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.