త్వరలో జయలలిత ఆస్తుల వేలం | Jayalalithaa disproportionate assets case: recover Rs 100-crore fine from Jaya estate, Karnataka government | Sakshi
Sakshi News home page

త్వరలో జయలలిత ఆస్తుల వేలం

Published Thu, Mar 23 2017 8:42 AM | Last Updated on Tue, Sep 5 2017 6:54 AM

త్వరలో జయలలిత ఆస్తుల వేలం

త్వరలో జయలలిత ఆస్తుల వేలం

చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో రూ.100 కోట్ల అపరాధ సొమ్మును వసూలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అనారోగ్యంతో జయలలిత మృతి చెందడంతో ఆమె శిక్షను రద్దు చేసున్నట్లు ప్రకటించిన సుప్రీంకోర్టు అదే సమయంలో అపరాధ రుసుం రూ.100 కోట్లను వేరే రూపంలో వసూలు చేయాలని ఉత్తర్వులిచ్చింది. ఇదిలావుండగా ఈ తీర్పును పున:సమీక్షించాలని కోరుతూ కర్ణాటక ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో మంగళవారం పిటిషన్‌ దాఖలైంది.

ముద్దాయి చనిపోయిన నేపథ్యంలో జయలలితకు విధించిన అపరాధ రుసుం వసూలు చేసేందుకు రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదనేది ఈ పిటిషన్‌ సారాంశం. ఈ పిటిషన్‌ త్వరలో సుప్రీంకోర్టు విచారణకు రానుంది.  కాగా జయలలిత ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో కోర్టు ఆదేశాల మేరకు జయలలిత, శశికళ, ఇళవరసి, దివాకరన్ల నుంచి తమిళనాడు ప్రభుత్వం రూ. 130 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అయితే జయలలిత మరణించడంతో ఆమెకు చెందిన ఆస్తులను వేలం వేసి రూ. 100 కోట్ల అపరాధ రుసుం వసూలు చేయాలి. అలాగే  శశికళ, ఇళవరసి, దివాకరన్ ల నుంచి రూ.30 కోట్ల అపరాధరుసుం వసూలు చేయాలి.

దీనిపై డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బలగన్‌ తరఫున హాజరైన న్యాయవాదులు బాలాజీ సింగ్, తామరై సెల్వన్‌ మాట్లాడుతూ బెంగుళూరు ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఖరారు చేసిందని, దీంతో జయలలిత మృతి చెందినా ఆమెకు విధించిన రూ.100 కోట్ల అపరాధ సొమ్మును చెల్లించాల్సి ఉందని తెలిపారు. జయలలిత ఆస్తులను వేలం వేసి అపరాధ సొమ్మును వసూలు చేయవచ్చని న్యాయమూర్తి కున్హా కూడా తీర్పులో వివరంగా తెలిపారన్నారు. త్వరలో ఆస్తులను వేలం వేయాలనే ఉద్దేశంతో పిటిషన్‌ కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా కర్ణాటక ప్రభుత్వానికి కేసు ఖర్చునిమిత్తం రూ.12 కోట్ల 50 లక్షలు తమిళనాడు ప్రభుత్వం త్వరలో ఇవ్వనున్నట్లు తెలిపారు.

కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జయలలిత సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ ప్రకారం ఆమె ఆస్తులు విలువ 117 కోట్లు.  ఈ సంపదంతా  శశికళ నటరాజన్‌కు దక్కిందట... స్థిర, చర ఆస్తులన్నీ శశికళ చేతుల్లోకి వెళ్లిపోయినట్లు ప్రముఖ ఇంగ్లిష్‌ పత్రిక 'ది టెలిగ్రాఫ్‌' జయలలిత మరణించగానే ఓ కథనం ఇచ్చింది. జయలలితకు చెందిన  ఆస్తులకు శశిశళ, ఆమె కుటుంబ సభ్యులు వారసులని టెలిగ్రాఫ్‌ తెలియచేసింది. అయితే జయ ఆస్తులకు సంబంధించి అసలు పరిస్థితి ఏమిటనేది ఇప్పటివరకు స్పష్టత లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement