ఆరోగ్యం మెరుగు
పన్నెండు రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అన్నాడీఎంకే అధినేత్రి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మరింత మెరుగుపడినట్లు అపోలో ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుబ్బయ్య విశ్వనాథన్ సోమవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో ప్రకటించారు. ఇన్ఫెక్షన్ తగ్గేందుకు సాధారణ యాంటీ బయాటిక్స్ ఇస్తూ అపోలో డాక్టర్ల బృందం నిరంతర పర్యవేక్షణలో వైద్యచికిత్స సాగుతోందని పేర్కొన్నారు. వైద్యానికి ఆమె శరీరం నుంచి పూర్తిగా స్పందన లభిస్తోందని అన్నారు. ఇన్‌ఫెక్షన్స్ పూర్తిగా తగ్గేందుకు మరికొన్ని రోజులు ఆమె ఆసుపత్రిలోనే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. బాగా మెరుగుపడినందున లండన్ వైద్యుడు రిచర్డ్‌బెలే తిరిగి తన దేశానికి వెళ్లిపోయినట్లు అందులో పేర్కొన్నారు.
హైకోర్టులో పిటిషన్: ముఖ్యమంత్రి అరోగ్యంపై పలు అనుమానాలు, వదంతులు ప్రచారంలో ఉన్నందున వాటికి అడ్డుకట్ట వేసే విధంగా ప్రభుత్వమే ఒక అధికారిక ప్రకటన, ఫొటోను విడుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ ప్రముఖ సామాజిక కార్యకర్త ‘ట్రాఫిక్’ రామస్వామి సోమవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అమ్మ ఆరోగ్యం కుదుటపడింది, రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని అపోలో ప్రకటించింది. అయితే అకస్మాత్తుగా లండన్ నుంచి ప్రత్యేక వైద్యుడిని పిలిపించడం ఏమిటని ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, గవర్నర్ విద్యాసాగర్‌రాావు తదితర ఎందరో ప్రముఖులు సీఎంను చూసి వెళ్లినా వారు పరామర్శిస్తున్నట్లుగా ఫొటోలు వెలువడక పోవడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఇలాంటి పోకడలతో ప్రజలు, అన్నాడీఎంకే శ్రేణుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేలా ప్రభుత్వమే ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేసేలా ఆదేశించాలని హైకోర్టుకు విన్నవించుకున్నారు. గవర్నర్ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, ఆరోగ్యశాఖ కార్యదర్శి, అపోలో ఆసుపత్రి యాజమాన్యాన్ని తన పిటిషన్‌లో చేర్చాడు.
ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అమ్మ ఆరోగ్యంపై ఫేస్‌బుక్ ద్వారా అవాస్తవాలు ప్రచారం చేసిందన్న ఆరోపణలపై పోలీసు కేసును ఎదుర్కొంటున్న తమిళచ్చి(ఫ్రాన్స్)ని భారత రాయబార కార్యాలయ సహకారంతో అరెస్ట్ చేసేందుకు పోలీస్ యంత్రాంగం సిద్ధమైంది. సీఎం త్వరగా కోలుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సోమవారం సందేశం పంపారు. వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ సోమవారం అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకుని అమ్మ ఆరోగ్యంపై వాకబు చేశారు. రెండు రోజుల్లో సీఎం డిశ్చార్జ్ అవుతారని తన వద్ద సమాచారం ఉన్నట్లు ఆయన తెలిపారు.
అమ్మ కోసం కలశ పూజలు: ముఖ్యమంత్రి జయలలిత వేగంగా కోలుకుని సంపూర్ణ ఆర్యోగంతో డిశ్చార్జ్ కావాలని ప్రార్థిస్తూ సోమవారం పెద్ద సంఖ్యలో కదలి వచ్చిన కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే వెట్రివేల్ నేతృత్వంలో వేలాది మంది మహిళలు, పురుషులు అలంకరించిన కలశాలను తలపై ఉంచుకుని ఆర్కేనగర్‌లో ఊరేగింపు జరిపారు. పురుషులు, మహిళలేగాక చిన్నారులు సైతం నోటికి శూలాలను గుచ్చుకోవడం, ఒక వృద్ధుడు తన వీపునకు అనేక శూలాలను గుచ్చుకుని చేతిలో జయలలిత ఫొటో పట్టుకుని క్రేన్‌కు వేలాడుతూ ర్యాలీలో కొనసాగడం చూపరులను గగుర్పాటుకు గురిచేసింది.