పోయెస్ గార్డెన్ వెలవెల
చెన్నై: పోయెస్ గార్డెన్ వేదనిలయం, చెన్నై.. తమిళనాడు ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాలవారికి ఈ చిరునామా సుపరిచితం. జయలలిత బతికున్న రోజుల్లో ఈ ఇల్లు ఓ వెలుగు వెలిగింది. తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పులకు, కీలక నిర్ణయాలకు, అనూహ్య ఘటనలకు వేదికగా నిలిచింది. జయలలిత హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఆమె తల్లి ఈ ఇంటిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి జయలలిత శాశ్వత నివాసం ఇక్కడే. జయలలిత సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఎన్నో అవమానాలు, సవాళ్లను ఎదుర్కొని ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంటిలోనే ఉన్నారు. అన్నా డీఎంకే రాజకీయాలకు పోయెస్ గార్డెన్ కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచింది. అమ్మ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీఐపీలు, పలు రంగాల ప్రముఖులతో ఈ ఇల్లు నిత్యం కళకళలాడుతుండేది. ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం పోయెస్ గార్డెన్ బోసిపోయింది.
ఇప్పడక్కడ అమ్మ అభిమానులు లేరు. పార్టీ కార్యకర్తలు లేరు. నాయకులు లేరు. ఇంటి బయట పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన, ఉత్కంఠ వాతావరణం మధ్య ఆ ప్రాంతం నిర్మానుషంగా మారింది. ప్రస్తుతం ఈ ఇంటిలో జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె బంధువులు ఉంటున్నారు. అన్నాడీఎంకేలో చీలిక కారణంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలను శశికళ వర్గం ఇతర ప్రాంతాలకు తరలించి క్యాంపులు నిర్వహిస్తోంది. ఎంపీలు ఢిల్లీలో ఉన్నారు. జయలలిత మరణించినపుడు ఆమెకు నివాళులు అర్పించేందుకు పోయెస్ గార్డెన్‌కు జనం పోటెత్తారు. ఆ తర్వాత ఈ ఇంటిపై వివాదం నడుస్తోంది. జయలలిత ఆస్తి తమకే దక్కుతుందని, శశికళ కుట్ర చేసి తమను దూరం చేశారని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక ఇంటిని అమ్మ మెమోరియల్‌గా మార్చాలని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం నిర్ణయించారు. ఏదేమైనా అమ్మ లేని పోయెస్ గార్డెన్ వెలవెలబోతోంది.
సంబంధిత వార్తలు చదవండి
గవర్నర్ నిర్ణయం లేటు..ఎవరికి చేటు? ఎవరికి సీటు?
పన్నీర్కే 95 శాతం మద్దతు!
గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
ఎత్తుకు పైఎత్తు
నేను ముఖ్యమంత్రి కావడం ఖాయం