
‘అమ్మ’ను కడసారి చూసేందుకు..
జనసంద్రమైన చెన్నై వీధులు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థీవ దేహాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. రాజాజీహాల్ ప్రాంతంతో పాటు చెన్నైవీధులు జన సంద్రమైయ్యాయి. చివరిసారిగా అమ్మను చూసేందుకు రాష్ట్ర నలుమూలాల నుంచి అమ్మ అభిమానులు, ఏఐడీఎంకే పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో చెన్నై నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ప్రజల సందర్శనార్ధం పార్థీవ దేహాన్ని ఉంచిన రాజాజీ హాల్ పరిసర ప్రాంతాల్లోను భద్రత కట్టుదిట్టం చేశారు. భారీకేడ్లు ఏర్పాటు చేసి క్యూలలో ప్రజలను పంపిస్తున్నారు. జయలలితతో తమకున్న అనుబంధాన్ని పార్టీ కార్యకర్తలు, ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అమ్మకు కడసారిగా కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. చెన్నై మెరీనా బీచ్‌లోని ఎంజీఆర్ సమాధి పక్కన మంగళవారం సాయంత్రం 5-6 గంటల మధ్య జయలలిత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.