అసలైన ఆనందంలో అన్నయ్య
ఇప్పటి వరకూ తన సంతోషంతోనే తృప్తిపడిన అన్నయ్య ఇప్పుడే అసలైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు అన్నారు నటుడు జయంరవి. ఏమిటి అసలు ఆనందం, కొసరు సంతోషం అదేమిటో చూద్దాం. జయంరవి తన అన్నయ్య మోహన్‌రాజా (జయంరాజా పేరు మార్చుకున్నారు) దర్శకత్వంలో నటించిన ఆరవ చిత్రం తనీఒరువన్. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ నిర్మించింది. ఇటీవల విడుదలయిన తనీఒరువన్ విశేష ప్రజాఆధరణతో ప్రదర్శింపబడుతోంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం సక్సెస్ మీట్‌ను నగరంలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించింది. ఇందులో పాల్గొన్న చిత్ర కథానాయకుడు జయంరవి మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకుడు, తన సోదరుడు ఇప్పటి వరకూ నా సంతోషాన్ని తన సంతోషంగా భావిస్తూ వచ్చారు. దర్శకుడిగా పలు విజయాలను పొందినా రీమేక్‌ల రాజాగానే పిలవబడ్డారు. ఇవన్నీ చూస్తూ అన్నయ్య తానేమిటో నిరూపించుకునే రోజు వస్తుందని నేను మనసులోనే అనుకునేవాడిని. అది ఈ తనీఒరువన్ చిత్రంతో జరిగింది. ఇది అన్నయ్య తయారు చేసిన కథతో తెరకెక్కించిన చిత్రం.
చాలా పెద్ద విజయం సాధించడం చెప్పలేనంత ఆనందంగా ఉంది. చిత్రం విడుదలకు ముందే చిత్రం ఘన విజయం సాధిస్తుందని మా కుటుంబ సభ్యులకు చెప్పారు. అన్నయ్య మోహన్‌రాజాగా పేరు మార్చుకున్నట్లు తనీఒరువన్ చిత్రం విజయం తరువాత తనీఒరువన్ రవిగా పేరు మార్చుకుంటారా? అని అడుగుతున్నారని తొలి చిత్రం జయం నాకు అడ్రస్ నిచ్చింది. అందువల్ల జయంరవి పేరును మార్చుకునే ప్రశక్తే లేదు.అయితే తనీఒరువన్ నా గుండెల్లో చెరగని పచ్చబొట్టుగా నిలిచిపోతుందిఅని జయంరవి అన్నారు.
త్రిశంకు స్వర్గంలో ఉన్నా
దర్శకుడు మోహన్‌రాజా మాట్లాడుతూ ఇప్పటి వరకూ నేను త్రిశంకు స్వర్గంలో ఉన్నాను. ఏ చిత్రం చేసినా ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉన్నారు. సొంతంగా తయారు చేసుకున్న కథల్లో నటించడానికి హీరో లెవరూ అంగీకరించని పరిస్థితి. ఎలాంటి చిత్రం చెయ్యాలో అర్థం గాక రీమేక్ చిత్రాలు చేసుకుంటూ వచ్చాను. ఫలితం రీమేక్ చిత్రాల దర్శకుడుగా ముద్ర వేశారు. ఇలా పుష్కర కాలం గడిసిపోయింది. అలాంటిది ఏజీఎస్ సంస్థ అధినేత 2009లో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడే సొంత కథతో చిత్రం చేయాలని ప్రోత్సహించారు. తనీఒరువన్ చిత్రం ద్వారా ఒక వ్యక్తిపై ప్రతీకారం అనే ఫార్ములాను బ్రేక్ చేసి విజయం సాధించాను అని అన్నారు.