
ధర్నాలు, ఆందోళనల వల్ల ఏమీ ప్రయోజనం లేదు
న్యూఢిల్లీ: నిరాహార దీక్ష వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదని మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అందువల్లనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తమ డిమాండ్ల సాధనకోసం జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష నిర్వహిస్తున్న ఆల్ గెస్ట్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులను శనివారం పరామర్శించిన అరవింద్... తన అనుభవాన్ని వారికి పూసగుచ్చినట్టు వివరించారు. అందువల్ల వెంటనే దీక్షను విరమించాలని వారిని కేజ్రీవాల్ కోరారు. కాగా మా ధర్నాలో మీరు కూడా పాల్గొంటారా అంటూ ఉపాధ్యాయులు ప్రశ్నించగా అందుకు తనకు ఎటువంటి ఇబ్బందీ లేదని, అయితే దాని వల్ల ఫలితం కూడా లేదని తెలిపారు. ‘నిరాహార దీక్ష వల్ల మీకు ఎటువంటి ఉపయోగమూ లేదు. పైగా మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
నేను కూడా గతంలో 15 రోజులపాటు నిరాహార దీక్ష చేశా. ఆ తర్వాతనే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా’నని ఆయన వివరించారు. బీజేపీ ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి ఉపశమనమూ లభించదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీనిగానీ లేదా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌నుగానీ కలవండంటూ హితబోధ చేశారు. ఇందువల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందన్నారు. ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్నాయని, అందువల్ల రాజకీయ నాయకులు మిమ్మల్ని కలిసేందుకు రావడమే కాకుండా, హామీలిస్తారని, అయితే అందువల్ల ప్రయోజనమేమీ ఉండబోదన్నారు. వాళ్లు ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడానికే పరిమితమవుతారన్నారు.
ఇప్పటికీ తాను అధికారంలో ఉండిఉంటే కనుక మీ సమస్యను పరిష్కరించేవాడినన్నారు. ఇదిలాఉండగా ఆందోళనలో పాల్గొన్న ఇద్దరు ఉపాధ్యాయుల ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో కేజ్రీవాల్ వారిని సమీపంలోని రామ్‌మనోహర్‌లోహియా ఆస్పత్రికి తరలించారు. వారిరువురు చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఉపాధ్యాయులంతా గత మూడు వారాలుగా ధర్నా నిర్వహిస్తున్న సంగతి విదితమే. తమ సేవలను పునరుద్ధరించాలంటూ పదివేలమందికిపై ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. తమకు విధించిన వయోపరిమితిని పెంచాలనేది వారి డిమాండ్లలో ఒకటి. కాగా సీఎం కాకముందు అరవింద్ కేజ్రీవాల్ అనేక ధర్నాలు, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదే ఆయన రాజకీయ పార్టీ స్థాపించడానికి మూలమైంది.