బీబర్ కోసం ఒంటరిగా..!
ముంబై : పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ మేనియా ఇండియాను ఏ స్థాయిలో ఊపేస్తుందో తెలిపే మరో ఘటన ఇది. ఇక్కడి డీవై పాటిల్ స్టేడియంలో బీబర్ ప్రదర్శనను చూసేందుకు పన్నెండేళ్ల చిన్నారి విమానమెక్కి ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చేసింది. ఢిల్లీకి చెందిన అక్షితా రాజ్‌పాల్ అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. బీబర్‌కు వీరభిమాని అయిన ఆమె, బీబర్ షోను అమ్మానాన్నలతో కలిసి చూడడానికి మూడు ప్లాటినం టికెట్లను బుక్ చేసింది. కాని చివరి నిమిషంలో ఆమె తల్లిదండ్రులు రాలేకపోయారు. కానీ అక్షిత మాత్రం చక్కగా విమానంలో నవీ ముంబైకు చేరుకుంది. తన దగ్గరున్న రెండు టికెట్లను ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కు ఇచ్చేసింది.
చదువులోనే కాకుండా సంగీతం, మార్షల్ ఆర్ట్స్, మోడలింగ్, నటనలో అక్షిత చురుగ్గా ఉంటుందని ఆమె మామయ్య సుమిత్ కౌశిక్ మీడియాకు తెలిపారు. అక్షిత ఇంతకుముందు బాలీవుడ్ చిత్రం ‘ఫిలౌరీ’లో చిన్న పాత్రలో నటించింది. అంతేకాకుండా ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, కొడక్, బిర్లా సన్ లైఫ్స్, ఫోర్టిస్, తదితర కంపెనీల ప్రకటనల్లోనూ కనిపించింది. అక్షిత తండ్రి అజయ్ రాజ్‌పాల్ ఢిల్లీలోని లజ్‌పత్ నగర్ మార్కెట్‌లో ఓ ఫ్యాషన్ రిటైల్ స్టోర్‌ను నిర్వహిస్తుండగా, తల్లి భావన ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది.