గోవిందా..గోవిందా..! | Kalyana celebration of Sri Venkateswara Swamy | Sakshi
Sakshi News home page

గోవిందా..గోవిందా..!

Published Sat, Feb 15 2014 11:08 PM | Last Updated on Sat, Sep 2 2017 3:44 AM

Kalyana celebration of Sri Venkateswara Swamy

 సాక్షి, ముంబై: వర్లీలోని బాలాజీ మందిరం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు కార్యక్రమాల్లో త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి పాల్గొన్నారు. ఆయనకు మందిర కార్యవర్గం ఘనస్వాగతం పలికింది. కాగా, రెండో రోజు ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. మూలమూర్తి మంత్రహోమం, బలిహరణం, ఎదరుకోళ్ల ఉత్సవ ంతోపాటు పూర్ణకుంభ స్వాగత కార్యక్రమం జరిగింది. అనంతరం ప్రవచనాల కార్యక్రమంలో చినజీయర్ స్వామి భక్తులకు ఉపదేశాలు చేశారు.

మూడు రోజులు జరగనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజున విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మత్సంగ్రహణం, అంకుర్చాణం, ధ్వజారోహణం తదితరాలతోపాటు అనేక ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. మొదటి రోజు సాయంత్రం నిత్యహోమం, నిత్యపూర్ణాహుతి, సామూహిక విష్ణుసహస్రనామ విశేష ద్వాదశ షోడషోపచార ఆరాధన జరిగింది.

 గోవిందుని నామస్మరణతో...
 వర్లీ బీడీడీ చాల్ పరిసరాలు గోవిందుని నామస్మరణతో మారుమోగుతున్నాయి. 84, 85 బిల్డింగ్ పరిసరాల్లో ఉన్న బాలాజీ దేవస్థానంలో జరుగుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. స్వామివారిని దర్శించుకుంటున్నారు. వీరిలో తెలుగు వారేకాకుండా మరాఠీ, ఇతర రాష్ట్రాల భక్తులు కూడా ఉన్నారు. గోవిందా.. గోవిందా.., ఏడు కొండలవాడా వెంకటరమణా గోవిందా... గోవిందా.. అన్న నామస్మరణతో భక్తిమయ వాతావరణం నెలకొంది.

 వర్షంలో కూడా....
 ఈ కార్యక్రమాల సందర్భంగా శనివారం 12 గంటల ప్రాంతంలో వర్షం వచ్చినప్పటికీ భక్తులు మాత్రం ఎక్కడికీ కదల్లేదు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా దేవుణ్ని దర్శించుకునేవారు కూడా వస్తూనే ఉండడం కనిపించింది.  ఈ సందర్భంగా ఆలయం ముందు రోడ్డును పూర్తిగా రాకపోకలకు మూసివేసి ఆరు బయటే టెంట్ వేశారు. అక్కడే భారీ సంఖ్యలో మహిళలతోపాటు పిల్లలు పెద్దలు కూర్చుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఆ సమయంలో వర్షం కారణంగా టెంట్ నుంచి వర్షం నీరు కిందికి జారిపడుతున్నా కదలకుండా ఎంతో భక్తిశ్రద్ధలతో కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

 నేడు శ్రీవారి ఊరేగింపు...
 శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో చివరి రోజు అనగా ఆదివారం శ్రీవారి ఊరేగింపు కార్యక్రమం జరగనుంది. అంతకుముందే కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు తెలుగు సంఘాలతోపాటు ఇతర సంఘాలు, సామాజిక సంస్థలు, ఇతర భక్త సమాజాలన్నీ ఎంతో సహకరిస్తున్నాయని దేవస్థానం అధ్యక్షుడు పొట్టబత్తిని కృష్ణహరి, ఉపాధ్యక్షుడు సిరిమల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రాజా రేడేకర్, కోషాధికారి మ్యాన నాగేష్‌లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement