ప్రజలకు ఈ ప్రభుత్వం వద్దు | Kamal Haasan blames Jayalalitha and presses for reelection in TN | Sakshi
Sakshi News home page

ప్రజలకు ఈ ప్రభుత్వం వద్దు

Published Tue, Mar 14 2017 2:06 AM | Last Updated on Thu, May 24 2018 12:10 PM

ప్రజలకు ఈ ప్రభుత్వం వద్దు - Sakshi

ప్రజలకు ఈ ప్రభుత్వం వద్దు

మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి
నటుడు కమల్‌హాసన్‌ సంచలన వ్యాఖ్యలు
తమిళ చానల్‌కు ఇచ్చిన     ఇంటర్వ్యూలో వెల్లడి
రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు

సాక్షి ప్రతినిధి, చెన్నై : ప్రస్తుతం రాష్ట్రంలో పాలన సాగిస్తున్న ఎడపాడి ప్రభుత్వం నాలుగేళ్లపాటూ ఉండాలని ప్రజలు కోరుకోవడం లేదు, కాబట్టి వెంటనే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి’.. ఈ వ్యాఖ్యలు చేసింది తిరుగుబాటు వర్గ నేత పన్నీర్‌సెల్వం కాదు. ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్‌ అంతకంటే కాదు. ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్‌ నోటి నుంచి సోమవారం సంచలన వ్యాఖ్యలు వెలువడ్డాయి. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వంలో ఏర్పడిన పరిణామాలు కమల్‌లో నిగూఢమై ఉన్న రాజకీయాలపై ఆసక్తిని పెంచాయి. జల్లికట్టు ఉద్యమం మొదలు అనేక కీలక అంశాలపై విమర్శలు చేస్తున్న కమల్‌ హాసన్‌ సోమవారం మరింత దూకుడు ప్రదర్శించారు. సోమవారం ఒక తమిళ టీవీ చానల్‌ (పుదియ తలైమురై)కు ఇచ్చిన ఇంటర్వూ్యలో.. ఆయన మాటలు యథాతథంగా..

విశ్వరూపం సినిమా విడుదలకు ముం దు, ఆ తరువాత చోటుచేసుకున్న పరి ణామాలకు కారణం ఇస్లాం వర్గం కాదు, రాజకీయ నాయకులే పూర్తిగా కారకులు. ఆనాడు అధికారంలో ఉన్న వారే విశ్వరూపం విడుదల కాకుండా అడ్డుకున్నారు. నేను కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతాను, అదే రాజకీయ మాటలు గా మారాయి. భవిష్యత్తు రాజకీయాలకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తే ఇంకా మాట్లాడుతూనే ఉంటాను. కేవలం కళాకారుడిగా ఉండడం నావల్ల కాదు. నా వ్యాఖ్యలు ప్రజలకు చేరుతాయి కాబట్టే విమర్శలు చేస్తున్నాను. నా జీవితంలో అవినీతి, అక్రమాలకు తావివ్వలేదు. నా మాటల ప్రభావం అడ్డుపెట్టుకుని ఓటు అమ్ముకుంటే నేతలను ప్రశ్నించే అవకాశం ఉండదు.

నేరాలు ఘోరాలకు పాల్పడితే అధికారంలో ఎవరున్నా నిలదీస్తాను. భారత దేశ పౌరుడిగా రాజకీయాలు మాట్లాడే హక్కు నాకుంది. ఎర్రచొక్కా వేసుకున్నంత మాత్రానా కమ్యూనిస్టు వాది అని భావించరాదు. (ఇంటర్వూ్యకు కమల్‌ ఎర్రచొక్కాతో వచ్చారు.) నన్ను రాజకీయాల్లోకి తీసుకురావాలని ఎంతోకాలంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రభుత్వం తప్పులు చేసే కొద్దీ ప్రజల్లో సహనం నశించిపోయి ఆగ్రహం పెరిగిపోతుంది. కాలానికి అనుగుణంగా రాజకీయనాయకులు మారాలి. పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలు తీసుకురావాలి. ద్రవిడ పార్టీలకు కాలం చెల్లిందని చెప్పడానికి వీల్లేదు. తమిళ తల్లి ఆశీర్వాదం ఉన్నంత వరకు ద్రవిడ సిద్ధాంతం వర్ధిల్లుతూనే ఉంటుంది. జాతీయ పార్టీలు రాష్ట్ర పాలనలో ప్రవేశించదలుచుకుంటే ద్రవిడ పార్టీలను ఢీకొనక తప్పదు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం వెనుక మర్మాన్ని వెలికితీయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. జయలలిత తన జీవితంలో పారదర్శకంగా వ్యవహరించలేదు. ఆమెకు జరిగిన చికిత్స సైతం గోప్యంగా ఉంచడానికి ఇది ఒక కారణం కావచ్చు.

వెంటనే ఎన్నికలు జరపాలి :
ప్రస్తుతం రాష్ట్రంలోని ఎడపాడి ప్రభుత్వాన్ని ప్రజలు అంగీకరించడం లేదు. రాష్ట్రం లో వెంటనే ఎన్నికలు జరగాలి. ఎన్నికలు నిర్వహించేందుకు చట్టం ఒప్పుకోదు అనే కారణంతో ప్రజలకు ఇష్టంలేని పాలనను నాలుగేళ్లు కొనసాగాలని ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. నాలుగేళ్లు కొనసాగాల్సిందేనని చెప్పడం బలవంతపు పెళ్లిలా ఉంటుంది. రాష్ట్రాన్ని ఎవరు పాలించాలనేది ప్రజలు నిర్ణయించాలి. పన్నీర్‌సెల్వం, ఎడపాడి పళనిస్వామి... వీరిద్దరిలో ఎవరిపైనా తనకు ప్రత్యేకమైన మమకారం లేదు. ఎవ్వరికీ మద్దతుగా నేను మాట్లాడటం లేదు. సినిమాల గురించి రాజకీయనాయకులు మాట్లాడినట్లే రాజకీయాల గురించి నేను మాట్లాడుతున్నా. రాజకీయాల్లో ధనప్రభావం, కుల మతాల జాఢ్యం పోవాలని ఆశిస్తు న్నా. జయ మరణం తరువాత రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ శూన్యతను నింపేందుకు కమల్‌ రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement