సినీ వర్గాల్లోనూ చిన్నమ్మపై వ్యతిరేకత
తమిళసినిమా : చిన్నమ్మ (శశికళ) సీఎం కావడాన్ని రాజకీయాల్లో ఒక వర్గం స్వాగతిస్తున్నా, మరో వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. రాజకీయ విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఇక రాజకీయాలతో దగ్గర సంబంధాలున్న చిత్ర పరిశ్రమ నుంచి చిన్నమ్మకు సీఎం పీఠం కట్టబెట్టడంపై ఆక్షేపణలు వ్యక్తం అవుతున్నాయి. విశ్వనటుడు కమలహాసన్ వంటి వారు శశికళకు ముఖ్యమంత్రి బాధ్యతలు భారం అవుతాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల జరుగుతున్న సంఘటనలకు ట్విట్టర్‌లో స్పందిస్తున్న కమలహాసన్ ఆ మధ్య జయలలిత మరణించినప్పుడు ఆమె పేరు ప్రస్తావించకుండా సంబంధించిన వారికి సంతాపాలు అంటూ క్లుప్తంగా పేర్కొన్నారు.
తాజాగా శశికళను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మోయదగ్గ బరువు మించితే ఏ బండి అయినా కప్పకూలిపోతుందని తిరుక్కురల్‌లో పేర్కొన్నారు.. అంటూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పదవి శశికళకు భారం అవుతుందనే భావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇక నటి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్త కుష్బూ తీవ్రంగానే ఆరోపణలు చేశారు. తమిళనాడు నిస్సత్తువగా మారిపోయిందన్నారు. శశికళ ముఖ్యమంత్రి కావడం ద్వారా ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడిందని పేర్కొన్నారు. ఏదేమైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన వారే ముఖ్యమంత్రి కావాలని అన్నారు. జల్లికట్టు క్రీడ కోసం విద్యార్థులు, యువత పోరాడారని, అదే విధంగా ఇప్పుడు శశికళకు వ్యతిరేకంగా పోరాడాలని కుష్భూ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చిన ఆ పార్టీ ప్రచార కర్త, నటుడు ఆనందరాజ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్రంలో పాలన ప్రశాంతంగా సాగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకోవలసిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఒక పార్టీకి నాయకులను ఎన్నుకోవడానికి ఆ పార్టీ కార్యవర్గ సభ్యులకు హక్కు ఉంటుందని, అదే విధంగా ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకునే హక్కు శాసన సభ్యులకు ఉంటుదని పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి రాష్ట్రానికే కాదు. తమిళ ప్రజలకు కూడా అని, తమ ఓట్లతో ముఖ్యమంత్రిని ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంటుందని, అనవసర నిర్ణయాలు ఉండకూడదని ప్రకటనలో పేర్కొన్నారు.